పిల్లలు కింద పడటం తరచుగా జరుగుతుంటుంది. మంచంపై నుంచి, కుర్చీలోంచి ఎక్కువగా కింద పడుతుంటారు. బాల్కనీలోంచి, సైకిల్ తొక్కుతూ, మెట్లు దిగుతూ, ఆడుతూ కింద పడే ప్రమాదం ఉంటుంది. ఇలా కిందపడిన సమయంలో తలకు గాయాలు అవుతాయి. ఇలాంటి సందర్భంలో పిల్లల సంరక్షణ పట్ల తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. కొన్ని ప్రమాదకరమైన గాయాలను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ప్రతి గాయమూ ప్రమాదకరమైనదని ఆందోళన చెందకూడదు.
పిల్లలు కిందపడిన తర్వాత ఉత్సాహంగా లేకున్నా, తలకు గాటు పడినా, రక్తస్రావమైనా, గాయం అయినా, ఫిట్స్ వచ్చినా, తలనొప్పితో బాధపడుతున్నా, కంటి చూపు మారినట్టు గుర్తించినా, వెలుగు చూడలేకపోయినా, అధిక శబ్దం వినలేకపోయినా, మాటలు తడబడినా, వాంతులు అవుతున్నా వెంటనే పిల్లల వైద్యులకు చూపించాలి. చాలా సందర్భాల్లో పిల్లల తలకు అయిన గాయాలు ప్రమాదకరంగా పరిణమించవు. తల బొప్పి కడుతుందంతే! చిన్న గాయాలు అయితే ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోవాలి. రెండు రోజులు పిల్లలను దగ్గరగా గమనిస్తూ ఉండాలి. నొప్పి నివారణకు పారాసిటమాల్, ఐబ్రూఫిన్ మాత్రలు ఇవ్వొచ్చు. సైకిల్ తొక్కకుండా, కష్టమైన ఆటలు ఆడకుండా కట్టడి చేయాలి. వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉంచాలి.
పుర్రెకు పగుళ్లు, రక్తం గడ్డ కట్టిన సందర్భాల్లోనే సీటీ స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలైనప్పుడు మాట నెమ్మదిగా, తడబడుతూ ఉంటుంది. పిల్లల ప్రవర్తన సరిగా ఉండదు. ఎక్కువ ఎత్తునుంచి పడితే, వాహన ప్రమాదంలో ఎగిరిపడితే, బలమైన వస్తువు తాకితే ఇంతటి తీవ్రమైన గాయాలవుతాయి. మూడు నెలలు అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మంచం, కుర్చీలపై నుంచి కింద పడతారు. ఇలా పడినప్పుడు పిల్లలు డల్‌గా ఉంటారు. నిద్రపోరు. తలను తాకితే ఏడుస్తారు. ముక్కులోంచి స్రావం అవుతుంది. వాంతులు అవుతాయి. ఇలాంటి సందర్భంలో సీటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
పిల్లల తలకు గాయాలు కాకుండా తల్లిదండ్రులు ముందే జాగ్రత్తపడాలి. టేబుల్ మీద వదలకూడదు. బెడ్ మీద నుంచి కింద పడకుండా రెయిల్ ఏర్పాటు చేయాలి. కార్ సీట్ బెల్ట్ పెట్టుకునేలా ప్రోత్సహించాలి. బైక్ మీద తీసుకెళ్తే పిల్లలకూ హెల్మెట్ పెట్టాలి. సైకిల్ తొక్కినా హెల్మెట్ ధరించమని చెప్పాలి. బాత్రూమ్లో నాన్‌స్లిప్ మ్యాట్ ఏర్పాటు చేసుకోవాలి. ఆడే చోట రబ్బర్ మ్యాట్ ఉండేలా జాగ్రత్తపడాలి. బాల్కనీల్లో ఆడనీయొద్దు. స్కేటింగ్‌కి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. పొరపాటున ప్రమాదం జరిగినా దెబ్బ తీవ్రత తగ్గే అవకాశాలు ఉంటాయి.