స్త్రీలను వేధిస్తున్న క్యాన్సర్లలో ప్రధానమైన వ్యాధి అండాశయ క్యాన్సర్. స్త్రీల గర్భాశయంలో రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. అండాశయాల్లో కణాలు అదుపులేకుండా పెరిగిపోవడమే అండాశయ (ఒవేరియన్) క్యాన్సర్. కణాలు వేగంగా ఇంతలంతలై శరీరంలో ఆరోగ్యకరమైన కణజాలాన్ని దెబ్బతీస్తాయి. అయితే, ప్రాణాంతకమైన ఈ వ్యాధి లక్షణాలను తొలి దశలో గుర్తించడం కొంచెం కష్టం. కడుపు ఉబ్బరం, తింటూ ఉండగానే కడుపు నిండిన భావన, బరువు తగ్గడం, కటి ప్రాంతంలో అసౌకర్యం, అలసట, వెన్నునొప్పి, మలబద్ధకం లాంటి సమస్యలు, వెనువెంటనే మూత్రానికి వెళ్లాల్సి రావడం లాంటివి గమనిస్తే అండాశయ క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. రోగ నిర్ధారణ చేయించుకొని, తగిన చికిత్స తీసుకోవాలి.
Ovarian Cancer | ఒవేరియన్ క్యాన్సర్ (అండాశయ క్యాన్సర్) మహిళల్లో ప్రసూతి మరణాలకు ప్రధాన కారణంగా మారుతున్న మహమ్మారి. ఇది స్త్రీలలో సాధారణంగా వచ్చే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తదితర వ్యాధుల కంటే అత్యంత ప్రమాదకరంగా మారుతున్నట్టు క్యాన్సర్ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం సుమారు రెండున్నర లక్షల మంది ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. మనదేశంలో సుమారు 45 వేల నుంచి 50 వేల మంది ఏటా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
మహిళల్లో సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో సుమారు 60 శాతం కేవలం అండాశయ క్యాన్సర్ వల్లనే జరుగుతున్నట్టు వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. అంటే మహిళల్లో జరుగుతున్న గైనకాలజికల్ (ప్రసూతి సంబంధ) మరణాలకు అండాశయ క్యాన్సర్ ప్రధాన కారణంగా నిలుస్తున్నదన్నమాట. అయితే ఇతర క్యాన్సర్ వ్యాధుల్లా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం అంత సులభం కాదంటున్నారు వైద్యులు. ప్రారంభ దశలో గుర్తించడం కష్టమేనంటున్నారు. మరి ఈ మహమ్మారిని గుర్తించడం ఎలా, ఇది రావడానికి గల కారణాలు, వ్యాధిని నిర్ధారించే పద్ధతులు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు తదితర అంశాల గురించి అవగాహన చేసుకుందాం.
అండాశయ క్యాన్సర్‌ను సాధారణంగా గుర్తించడం కొంత కష్టం. ప్రారంభ దశలో గుర్తించలేం. లక్షణాలు కనిపించిన వెంటనే కొన్ని వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. అదే బ్రాకా పరీక్షలు. ఈ పరీక్షలు రెండు రకాలుగా ఉంటాయి. అంటే అనుమానిత రోగులను రెండు రకాలుగా విభజిస్తారు. అందులో మొదటిది బ్రాకా-1, రెండోది బ్రాకా-2. రోగుల్లో బ్రాకా-1 లేదా బ్రాకా- 2 పరీక్షలు చేసినప్పుడు, వీటిలో ఏ ఒక్కటి పాజిటివ్ వచ్చినా వారిలో 90- 95 శాతం మందికి అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
సాధారణంగా 50 ఏండ్లు నిండిన వారిలోనే అండాశయ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి గల కారణాలు చాలానే ఉన్నప్పటికీ కొన్నిటిని మాత్రం ప్రత్యేకంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇతర క్యాన్సర్ వ్యాధుల్లానే ఇది కూడా వంశపారంపర్యంగా కొంతమందికి వచ్చే అవకాశాలు లేకపోలేదు.
హానికరమైన రసాయనాలతో కూడిన కొన్ని రకాల పౌడర్ల మూలంగా ఈ క్యాన్సర్ సోకుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. అందులో ముఖ్యంగా ఆస్బెస్టాస్ కలిగిన పౌడర్లను వినియోగించడంతో మహిళలకు ఈ అండాశయ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది.
ఇంబ్యాలెన్స్ సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా ఆల్కహాల్, పొగాకు ఉత్పతులను వాడకం వల్ల కూడా ఈ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది.
మహిళలకు సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ ఒకటి. దీనిని ఇతర క్యాన్సర్లలా గుర్తించడం అంత సులభం కాదు. మహిళల్లో జరుగుతున్న ప్రసూతి మరణాలకు ఈ క్యాన్సరే ప్రధాన కారణం. అయితే ఏ క్యాన్సరైనా సరే ప్రజల్లో దాని గురించి సరైన అవగాహన చాలా ముఖ్యం. వ్యాధి లక్షణాలపై అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీనివల్ల క్యాన్సర్ ముదరకుండా ప్రారంభ దశలోనే వ్యాధికి అడ్డుకట్ట వేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం కాపాడుకోవడంతోపాటు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. అండాశయ క్యాన్సర్ విషయానికి వస్తే సాధారణంగా ఈ వ్యాధి వచ్చిన మహిళలకు సర్జరీ, కీమోథెరపితోపాటు యాంటి ఆంజియోజెనిక్ డ్రగ్స్‌తో చికిత్స అందించడం జరుగుతుంది.
ఈ మధ్యకాలంలోనే రకరకాల మందులు మన దేశ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి అండాశయ క్యాన్సర్ బాధితులకు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వైద్యులను సంప్రదించిన తర్వాతే మందులు వాడాల్సి ఉంటుంది. అయితే, మహిళలు కడుపునకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. అప్పుడే ఒక్క అండాశయ క్యాన్సర్ అనే కాదు ఎన్నో ఆరోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ చింతమడక సాయిరాం క్లినికల్ ఆంకాలజిస్ట్ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్