Diabetes and Orange | మనం తీసుకునే ఆహారం శక్తి రూపంలోకి మారడానికి ఉన్సలిన్ అనే హార్మోన్ అవసరం. ఈ హార్మోన్ సరైన మొత్తంలో ఉత్పత్తి కానప్పుడు.. లేదా సరిగా పనిచేయనప్పుడు రక్తంలో చక్కెర పోగవుతుంది. ఇదే మధుమేహం. ఎందుకిలా జరుగుతుందనేది ఇంతవరకు కచ్చితంగా గుర్తించలేదు. అయితే, జన్యువుల ప్రభావం వల్ల లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను వైరల్ ఇన్ఫెక్షన్ దెబ్బతీయడం వల్ల డయాబెటిస్ వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతున్నది. ప్రతి ఇంట్లో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారు ఆహారం విషయంలో నోరు కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఏది తినాలన్నా ముందు వెనకా ఆలోచించాల్సి వస్తుంది. స్వీట్లు తినలేరు.. పండ్లు తినాలన్నా ఎన్నో సందేమాలు. అయితే, కొన్నిరకాల పండ్లను డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినడం మంచిదే అని సెలవిస్తున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఆరెంజ్ పండ్లు తినడం వల్ల మధుమేహులకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయని చెప్తుననారు. ఆరెంజ్‌ను డయాబెటిస్ సూపర్‌ఫుడ్‌గా పిలుస్తుంటారు.
నారింజ పండ్లు జీర్ణమయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని నివారించడంలో గ్రేట్‌గా సాయపడుతుంది. ఒక ఆరెంజ్‌లో దాదాపు 40 నుంచి 43 వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) ఉంటుంది. ఫలితంగా ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఏ, సీ, ఈ విటమిన్లతోపాటు ల్యూటిన్, బీటాకెరోటిన్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ రోగుల్లో షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడంలో దోహదపడతాయి.
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, ఆరేంజ్ పండ్లలో ఫైబర్, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన మధుమేహ ఆహార ప్రణాళికకు ప్రయోజనం చేకూరుస్తాయి. నారింజలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండి మెల్లగా జీర్ణం అయ్యేందుకు సాయపడుతుంది. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్ధారిస్తూ నెమ్మదిగా రక్తప్రవాహంలోకి చక్కెరను విడుదల చేస్తుంది. ఫలితంగా మధుమేహంతో బాధపడుతున్న వారిలో రక్తంలో చక్కెరల స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.
జ్యూస్‌లకు బదులుగా ముక్కలు తినాలి..
నారింజ పండ్ల రసం తాగడం కంటే నారింజ ముక్కలను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. సాధారణంగా రసాలలో తగినంత పీచుపదార్థాలు ఉండవు. అందుకని రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. జర్నల్ డయాబెటిస్ కేర్ ప్రకారం, సిట్రస్ పండ్లు తినడం వల్ల మహిళల్లో మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అయితే పండ్ల రసం తాగడం మధుమేహ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తియ్యని ఆరెంజ్ జ్యూస్ గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ 50గా ఉంటున్నందున జ్యూస్‌కు బదులుగా ముక్కలు తినడం అలవాటు చేసుకోవాలి.
ఆరెంజ్ పండ్లలో లభించే సీ విటమిన్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తిప్పికొట్టడంలో సహాయపడటానికి మధుమేహ రోగులకు సీ విటమిన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే, నారింజలో ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి మధుమేహం ఉన్నవారికి ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్సులిన్ నిరోధకత, ఇన్సులిన్ సెన్సిటివిటీ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో లభించే ఆంథోసైనిన్లు ఆక్సీకరణ ఒత్తిడి, గుండె జబ్బులు, వాపులతో సమర్ధంగా పోరాడుతాయి.