ప్రపంచవ్యాప్తంగా నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. నోరు, పెదవులు, నాలుక, గొంతు భాగాల్లో నోటి క్యాన్సర్ ప్రభావం చూపుతుంది. ఏటా వేలాది మంది ఉసురు తీస్తున్నది. తొలి దశలో వ్యాధిని గుర్తించడమే చికిత్సకు, రోగి త్వరగా కోలుకోవడానికి కీలకంగా నిలుస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా నోటి క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. నోరు, పెదవులు, నాలుక, గొంతు భాగాల్లో నోటి క్యాన్సర్ ప్రభావం చూపుతుంది. ఏటా వేలాది మంది ఉసురు తీస్తున్నది. తొలి దశలో వ్యాధిని గుర్తించడమే చికిత్సకు, రోగి త్వరగా కోలుకోవడానికి కీలకంగా నిలుస్తుంది. లక్షణాలు గుర్తించకపోతే క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యమైపోతుంది. కాబట్టి, నోటి క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవడానికి కొన్ని హెచ్చరికలు కనిపిస్తాయి. వాటినినిర్లక్ష్యం చేయకూడదు.
నోట్లో పుండ్లు
నోట్లో ఏర్పడిన పుండ్లు రెండు వారాల్లోగా తగ్గకపోతే అనుమానించాల్సిందే. అయితే, కొన్నిసార్లు పుండ్లు త్వరగా తగ్గిపోయినప్పటికీ, క్యాన్సర్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఈ పుండ్లు పెదవులు, చిగుళ్లు, బుగ్గల లోపలి భాగంలో కనిపిస్తాయి. వీటినుంచి రక్తం కారొచ్చు. లేదంటే ఇబ్బందికరంగా అనిపించవచ్చు. దంత వైద్యుణ్ని కలిసి పరీక్ష చేయించుకోవడం వ్యాధిని తొలిదశలో గుర్తించడానికి వీలు కనిపిస్తుంది.
మొద్దుబారడం, నొప్పి
నోట్లో ఎడతెగకుండా నొప్పి, మొద్దుబారినట్టు ఉండటం, నోరు, గొంతు, పెదవుల భాగాల్లో మంటగా అనిపించడం నోటి క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు. వీటిని సాధారణంగా దంత సమస్యలుగానో, నరాల సమస్యలుగానో పొరబడుతుంటారు.
మింగడంలో ఇబ్బంది
మింగడం, నమలడం, నాలుక, దవడ కదపడంలో ఇబ్బందిగా ఉంటే తేలిగ్గా తీసుకోకూడదు. ఇది నోటి క్యాన్సర్ తొలిదశ సంకేతం కావొచ్చు. గొంతులో గడ్డలా అనిపిస్తుంది. దీంతో ఆహారం లోపలికి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్, ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా జరుగుతుంది. కానీ, ఎక్కువ రోజులు సమస్య కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు.
నోటి దుర్వాసన
నోటి దుర్వాసనను చాలామంది మామూలు విషయంగా భావిస్తారు. అయితే, ఇది ఎక్కువ కాలంపాటు కొనసాగితే జాగ్రత్త వహించాలి. నోటి దుర్వాసన నోటి క్యాన్సర్‌కు తొలిదశ సంకేతం కూడా అవ్వొచ్చు.
గడ్డలు, వాపులు
నోరు, మెడ, దవడల్లో గడ్డలు, మందపాటి ప్యాచెస్, వాపు లాంటివాటిని అంతగా పట్టించుకోరు. తెలుపు, ఎరుపు ప్యాచ్‌ల రూపంలో నోటి క్యాన్సర్ లక్షణాలు బయల్పడతాయి. గడ్డల రూపంలోనూ ఉంటాయి. కాబట్టి, క్రమం తప్పకుండా నిపుణులను సంప్రదిస్తే నోటి క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించవచ్చు.
తగ్గించుకోవడం ఎలా
ఒక లక్ష మందిలో 11 మందికి వారి జీవితకాలంలో నోటి క్యాన్సర్ అభివృద్ధి చెందే ముప్పు ఉంటుంది. పురుషుల్లో ఈ రిస్క్ ఎక్కువ. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.
ధూమపానం: పొగాకు ఏ రూపంలో తీసుకున్నా నోటి క్యాన్సర్ రావొచ్చు. కాబట్టి, పొగతాగడం, జర్దాలాంటివి తినడం పూర్తిగా మానేయాలి.
మద్యపానం: నోటి క్యాన్సర్ సహా అన్ని రకాల క్యాన్సర్లు ఆల్కహాల్ సేవనం ద్వారా వస్తాయి. కాబట్టి పరిమితికి మించిన మద్యపానం మంచిది కాదు.
పెదవులకు సన్‌బ్లాక్: సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల (యూవీ రేస్) బారినుంచి కాపాడుకునేందుకు పెదవులకు సన్‌బ్లాక్ అప్లయి చేయడం ద్వారా నోటి క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు.
హెచ్‌పీవీ నుంచి రక్షణ: హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) కూడా నోటి క్యాన్సర్‌కు ఓ కారణం. టీకాలు, ఇతర జాగ్రత్తల ద్వారా హెచ్‌పీవీ బారినపడకుండా చూసుకోవాలి.
ఆరోగ్యమే మహాభాగ్యం
క్రమం తప్పకుండా దంతాల పరీక్ష చేయించుకోవాలి. దంత వైద్యులు నోటి క్యాన్సర్ తొలిదశ సంకేతాలను గుర్తించగలుగుతారు. తొలిదశలో గుర్తించడమే చికిత్సలో కీలకం. కాబట్టి, లక్షణాలను గమనించిన వెంటనే వైద్య సహాయం పొందాలి. తరచుగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. నోటి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలను భోజనంలో చేర్చుకోవాలి.