Olive Oil | చాలా మంది వంట చేసందుకు రిఫైన్డ్ నూనెలను ఉపయోగిస్తుంటారు. రిఫైన్డ్ పల్లి నూనె, పొద్దు తిరుగుడు విత్తనాల నూనె, బ్రాన్ ఆయిల్‌ను వాడుతారు. కానీ రీఫైన్ చేయబడిన వంట నూనెలు మన ఆరోగ్యానికి మంచివి కావని, గానుగలో ఆడించిన నూనెలను వాడితేనే మంచి జరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. రీఫైన్ చేయబడిన నూనెలను ఒక ఉష్ణోగ్రత వద్దకు వేడి చేస్తే వాటిల్లో హానికారక సమ్మేళనాల పరిమాణం పెరుగుతుంది. అలాంటి నూనెలను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడితే ఆ సమ్మేళనాల పరిమాణం మరింత పెరిగి అవి మన శరీరంలో చేరి మనకు తీవ్రమైన అనారోగ్యాలను కలగజేస్తాయి. అదే గానుగలో ఆడించిన నూనెలు అయితే అంత త్వరగా సమ్మేళనాలను ఏర్పరచవు. కాబట్టి గానుగలో ఆడించిన నూనెలను వాడాలని సూచిస్తుంటారు. అయితే అలాంటి నూనెల్లో ఆలివ్ నూనె కూడా ఒకటి. సాధారణంగా ఆలివ్ నూనె మనకు రీఫైన్డ్ చేయబడినది లభించదు. దీన్ని గానుగలో ఎలాగైతే తయారు చేస్తారో దాదాపుగా అదే క్వాలిటీతో మనకు లభిస్తుంది. దీన్నే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఇలాంట ఆలివ్ ఆయిల్‌ను వాడితే ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఆలివ్ ఆయిల్లో 73 శాతం ఓలియిక యాసిడ్ ఉంటుంది. ఇది ఒక మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుని క్యాన్సర్ రాకుండా చూస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. ఆలివ్ నూనెలో పాలిఫినాల్స్, విటమిన్ ఇ, కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్న నిర్మూలిస్తాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండా అడ్డుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్లో ఓలియోకాంథల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కనుక ఆలివ్ ఆయిల్‌ను వాడితే నొప్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆలివ్ ఆయిల్ రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని తగ్గిస్తుంది. హైబీపీ ఉన్నవారు ఆలివ్ ఆయిల్‌ను వాడుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌ను వాడితే రక్త నాళాల్లో ఏర్పడే క్లాట్స్‌ను కరిగించవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్ రాకుండా నివారించవచ్చు. అథిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఆలివ్ ఆయిల్‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. క్యాలరీలను ఖర్చు చేసి కొవ్వును కరిగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఆలివ్ ఆయిల్‌ను వాడుతుంటే ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుందని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఆలివ్ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థలో ఉండే పురుగులను నాశనం చేస్తుంది. జీర్ణాశయ అల్సర్లను తగ్గిస్తుంది. ఇలా ఆలివ్ ఆయిల్‌తో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీన్ని వంటల్లో ఉపయోగించవచ్చు. లేదా నేరుగా రాత్రి పూట ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవచ్చు. లేదా జుట్టు, చర్మానికి కూడా అప్లై చేయవచ్చు. దీంతో శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు.