Guava Leaves | జామకాయలు లేదా పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇవి మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. జామకాయలు కాస్త పచ్చిగా లేదా దోరగా ఉంటాయి. కొందరు వీటిని ఇష్టపడతారు. ఇంకొందరు కేవలం జామ పండ్లను మాత్రమే తింటారు. అయితే వేటిని తిన్నా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. కానీ మీకు తెలుసా..? జామ ఆకులు కూడా మనకు అనేక లాభాలను అందిస్తాయి. అయితే ఈ ఆకులను నేరుగా తినలేము. కానీ వీటిని నీటిలో వేసి మరిగించి తాగవచ్చు. కొన్ని జామ ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి మరిగించాలి. అనంతరం ఆ నీళ్లను వడకట్టి వాటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి ఉదయం పరగడుపున తాగాలి. కుదరకపోతే రోజులో ఏ సమయంలో అయినా తాగవచ్చు. ఇలా జామ ఆకులతో నీళ్లను తయారు చేసి తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
జామ ఆకుల నీళ్లను తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ నీళ్లను సేవిస్తే మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలు చాలా నెమ్మదిగా గ్లూకోజ్‌గా మారుతాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ చాలా నెమ్మదిగా పెరుగుతాయి. దీని వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్లో ఉండే పలు సమ్మేళనాలు షుగర్ లెవల్స్ పెరిగేందుకు కారణం అయ్యే ఎంజైమ్‌ల పనితీరును అడ్డుకుంటాయి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. జామ ఆకుల నీళ్లను తాగుతుంటే అనేక రకాల జీర్ణ సమస్యలు సైతం తగ్గిపోతాయి. ఈ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థలో ఉండే హానికర బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. దీని వల్ల విరేయనాలు తగ్గిపోతాయి. జీర్ణాశయంలో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
జామ ఆకుల నీళ్లను ఉదయం పరగడుపును తాగుతుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. అధికంగా బరువు ఉన్నవారు ఈ నీళ్లను తాగుతుంటే బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవచ్చు. దీని వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. బరువు తగ్గాలనుకునే ప్రణాళికలో ఉన్నవారు రోజూ జామ ఆకుల నీళ్లను తాగుతుంటే ఫలితం ఉంటుంది. జామ ఆకుల్లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధిత వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకుల నీళ్లను తాగితే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ట్రై గ్లిజరైడ్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ ఆకుల్లో ఉండే పొటాషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.
జామ ఆకుల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల శరీరం అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. అలాగే ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. జామ ఆకులను బాగా కడిగి నోట్లో వేసుకుని బాగా నమిలి కాసేపు ఉంచి ఉమ్మేయాలి. లేదా జామ ఆకుల నీళ్లను నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా చేయడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోట్లో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గడంతోపాటు దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా జామ ఆకులతో అనేక లాభాలను పొందవచ్చు.