Nose Bleed | కొందరికి అప్పుడప్పుడు ముక్కు నుంచి రక్తం కారుతుంది. ఎలాంటి దెబ్బ తగలకపోయినా, అనారోగ్య సమస్యలు లేకపోయినా కొందరికి ఉన్నట్లుండి సడెన్‌గా ముక్కు నుంచి రక్తం వస్తుంది. ఈ అనుభవాన్ని చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. అయితే ముక్కు నుంచి రక్తం కారడం అన్నది వృద్ధుల్లో సహజమే. కానీ యుక్త వయస్సులో ఉన్నవారికి ఇలా జరుగుతుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుక్త వయస్సులో ఉన్నవారికి పలు కారణాల వల్ల ఈ సమస్య వస్తుందని అంటున్నారు. బాగా గట్టిగా ముక్కును రుద్దితే అందులో ఉండే రక్త నాళాలపై అధికంగా ఒత్తిడి పడి అప్పుడు ముక్కు నుంచి రక్తం కారే అవకాశం ఉంటుంది. అలాగే కొందరు ముక్కులో పుల్లలు లేదా పదునైన వస్తువులను పెట్టి తిప్పుతారు. ఇలాంటి చర్యలు అప్పటికప్పుడు ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ముక్కులో ఉండే రక్త నాళాలకు తగిలితే మాత్రం అక్కడి నుంచి రక్త స్రావం అవుతుంది.
ఊపిరితిత్తులు లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా ఇలా కొందరికి ముక్కు నుంచి రక్తం కారుతుంది. సైనస్ ఉండడం, యాక్సిడెంట్ల కారణంగా దెబ్బలు బలంగా తగలడం, వాతావరణంలో ఉండే కాలుష్య కారకాలు, ఫుడ్ అలర్జీల బారిన పడడం, శరీరంలో వేడి అధికంగా ఉండడం, ముక్కులో తరచూ పొడి వాతావరణం ఏర్పడడం, దీర్ఘకాలంగా ముక్కు దిబ్బడతో బాధపడుతుండడం, హైబీపీ, మద్యం అధికంగా సేవించడం, రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడడం, పలు రకాల కెమికల్స్, కొకెయిన్ తీసుకోవడం వంటి కారణాల వల్ల కొందరికి అప్పుడప్పుడు ముక్కులో నుంచి రక్తం కారుతుంది.
అయితే చాలా మందికి ఈ సమస్య ఒకటి రెండు సార్లకు మించి రాదు. అలాంటప్పుడు పలు ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ఇందుకు పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. ముక్కు నుంచి రక్తం కారుతుంటే పలు ఇంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. ఈ సమస్య ఎదురైనప్పుడు పటిక బెల్లాన్ని కొంత తీసుకుని నీటిలో కలిపి తాగాలి. దీంతో వెంటనే ముక్కు నుంచి రక్తం కారడం తగ్గుతుంది. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు చాలా మంది ముక్కును పైకి ఎత్తుతారు. దీంతో రక్తం కారడం తగ్గుతుందని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఈ రక్తం శ్వాస వ్యవస్థలో చేరే ప్రమాదం ఉంటుంది. కనుక ముక్కు నుంచి రక్తం కారే సమయంలో ముక్కును కిందకు వంచాలి. కారినంత రక్తాన్ని కారనివ్వాలి. మరీ ధారాళంగా కారితే ప్రమాదం. కనుక అలాంటి స్థితిలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు దాన్ని ఒత్తి పట్టుకోకూడదు. ఎలాంటి ఒత్తిడిని ముక్కుపై కలిగించకూడదు. అలాగే ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకోవాలి. రక్తం కారడం ఆగిన తరువాత మళ్లీ ముక్కుతో శ్వాస తీసుకోవాలి. ముక్కుపై చల్లని ప్యాక్‌ను ఉంచాలి. దీంతో రక్తం కారడం తగ్గుతుంది. కొందరికి గదిలో వాతావరణం పొడిగా అవడం వల్ల ముక్కులో అలర్జీ వచ్చి రక్తం కారుతుంది. అలాంటప్పుడు హ్యుమిడిఫైర్‌ను వాడితే ఫలితం ఉంటుంది. మెడికల్ షాపుల్లో ఓవర్ ది కౌంటర్ నాసల్ డ్రాప్స్ లభిస్తాయి. వాటిని తెచ్చి వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అయితే మీకు గనక తరచూ ముక్కు నుంచి రక్తం కారుతుంటే కచ్చితంగా డాక్టర్‌ను కలవాలి. అది గుండె సంబంధ సమస్య లేదా క్యాన్సర్ అయి ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి స్థితిలో నిర్లక్ష్యం వహించకూడదు.