న్యూఢిల్లీ : భారత్‌లో కొవిడ్-19 నూతన వేరియంట్ సీ.1.2 కేసులు ఇప్పటివరకూ వెలుగుచూడలేదని ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ వేరియంట్ అధిక సంక్రమణ రేటును కలిగిఉండటంతో పాటు ప్రస్తుత కొవిడ్-19 వ్యాక్సిన్ల ప్రభావం నుంచి తప్పించుకుంటుందని దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐసీడీ), క్వజులు నటాల్ రీసెర్చ్ ఇన్నోవేషన్ సీక్వెన్సింగ్ ప్లాట్‌పాం (క్రిస్ప్) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో దక్షిణాఫ్రికాలో తొలుత సీ.1.2 గుర్తించిన ఈ వేరియంట్‌ను చైనా, కాంగో, మారిషస్, బ్రిటన్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లోనూ కనుగొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం గుర్తించిన ఆందోళనకర వేరియంట్లతో పోలిస్తే సీ.1.2 వేరియంట్ అధిక మ్యుటేషన్లను కలిగిఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇతర వేరియంట్ల మ్యుటేషన్ల రేటుతో పోలిస్తే నూతన వేరియంట్ మ్యుటేషన్ రేటు రెట్టింపుగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొనడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఇతర వేరియంట్ల బారినపడిన వారిలో తయారైన యాంటీబాడీలనూ ఈ వేరియంట్ బోల్తా కొట్టిస్తుండటంతో ప్రజలు మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను అనుసరించాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.