New Born Baby | అప్పుడే పుట్టిన బిడ్డకు రక్త పరీక్షలు, వినికిడి పరీక్షలు అవసరమా?మా అన్నయ్యకు బాబు పుట్టాడు. బిడ్డ బరువు మూడు కేజీలు. చక్కగా తల్లిపాలు తాగుతున్నాడు. వైద్యులు న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్‌లో భాగంగా రక్త పరీక్ష, వినికిడి పరీక్ష చేయాలని అంటున్నారు. పసిబిడ్డకు ఇన్ని పరీక్షలు అవసరమా?
– ఓ పాఠకురాలు
ప్రసవం కాగానే, బిడ్డకు ఏవైనా లోపాలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి తల నుంచి పాదాల వరకూ పరీక్ష చేస్తారు. నాలుగైదు చుక్కల రక్తాన్ని తీసుకుని న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడమూ సర్వ సాధారణమే. దీనివల్ల బిడ్డకు ఏవైనా తీవ్ర రుగ్మతలు ఉంటే.. ప్రారంభంలోనే గుర్తించవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడాన్ని హైపో థైరాయిడిజం అంటారు. లక్షకు రెండువేల మందిలో ఈ ఇబ్బంది ఉంటుంది. పుట్టిన వారంలోనే గుర్తిస్తే.. సరైన చికిత్స అందించవచ్చు. బిడ్డలో శారీరక, మానసిక వికాసానికి అవరోధం లేకుండా జాగ్రత్త పడవచ్చు. ఇదంతా న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారానే సాధ్యం. జన్యు సంబంధమైన, హార్మోన్ సంబంధమైన లోపాలను కనిపెట్టే పరీక్షలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
వినికిడి పరీక్ష కూడా అంతే కీలకమైంది. బిడ్డ పుట్టిన మూడు రోజుల తర్వాత ఎప్పుడైనా చేయవచ్చు. వినికిడి లోపం కనుక ఉన్నట్టయితే.. మూడు నెలలలోపు చికిత్స ఆరంభిస్తే లోపాన్ని సమర్థంగా సరిచేయవచ్చు. నవజాత శిశువుల దృష్టి దోషాలనూ గుర్తించే ప్రయత్నం చేస్తారు నేత్ర వైద్య నిపుణులు. ఆధునిక టెక్నాలజీతో పసిగుండె పనితీరును తెలుసుకునే అవకాశమూ ఉంది. ఒక చిన్న పరీక్ష.. బిడ్డ ప్రాణాలను నిలబెడుతుంది, పరిపూర్ణ ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. ఎదుగుదలకు సహకరిస్తుంది. కాబట్టి, వైద్యుల సలహా ప్రకారం పరీక్షలు చేయించండి. అంతా మంచే జరుగుతుంది.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్