Neurological Diseases | గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ తర్వాత భారత్‌లో నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ న్యూరాలజీ 2025 నివేదిక ప్రకారం.. గత మూడు దశాబ్దాల్లో భారత్‌లో నాడీ సంబంధిత వ్యాధులు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 మిలియన్ల మంది భారతీయులు స్ట్రోక్స్‌తో బాధపడుతున్నారు. అయితే చిత్తవైకల్యం, మైగ్రేన్స్, మూర్ఛ వంటి వ్యాధులు సైతం వేగంగా పెరుగుతున్నాయి. భారత్‌లోని మూడు కుటుంబాల్లో ఒకటి ఏదో రకమైన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తక్షణ విధాన పరమైన చర్యలు చేపట్టకపోతే రాబోయే దశాబ్దంలో ఈ సమస్య మరణాలకు, వైకల్యానికి ప్రధాన కారణం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా డేటా ప్రకారం.. ప్రతి నాలుగు నిమిషాలకు ఒక భారతీయుడు స్ట్రోక్‌తో మరణిస్తున్నాడు. 80 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ అల్జీమర్స్, చిత్తవైకల్యంతో బాధపడుతున్నారని అంచనా. ఈ సంఖ్య 2050 నాటికి 3కోట్లకు చేరుతుందని అంచనా. దాదాపు 15 కోట్ల మంది భారతీయులు ఎక్కువగా మహిళలు సాధారణ లేదంటే దీర్ఘకాలిక తలనొప్పి, మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. దేశంలో దాదాపు 1.2 కోట్ల మంది మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. కానీ, ఇందులో సగానికిపైగా చికిత్స తీసుకోవడం లేదు. పట్టణ వృద్ధ జనాభాలో పార్కిన్సన్స్, డయాబెటిక్ న్యూరోపతి కేసులు సైతం వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో లక్ష మంది జనానికి 0.3 మంది మాత్రమే న్యూరాలజిస్టులు ఉన్నారు. 70శాతం జనాభా నివసించే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. పెద్ద జిల్లాల్లో ఒక్క న్యూరాలిజస్ట్ కూడా అందుబాటులో లేరు. నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా ప్రకారం.. దేశంలో మొత్తం న్యూరాలజిస్ట్‌ల సంఖ్య సుమారు 35వేలు. కనీసం 50వేల మంది నిపుణులు అవసరమని భావిస్తున్నారు.
మిలియన్ల మంది రోగులు మధుమేహం, ఒత్తిడి, సాధారణ తలనొప్పి ప్రారంభ లక్షణాలు తప్పుగా భావిస్తారు. చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారు. శాశ్వత వైకల్యం, మరణం ప్రమాదం పెరుగుతుంది. నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రుల్లో 20శాతం మాత్రమే స్ట్రోక్స్ యూనిట్స్ ఉన్నాయి. పునరావాస కేంద్రాలు, పిల్లల న్యూరాలజీ సేవలు, పాలియేటివ్ కేర్ ఎక్కువగా మెట్రోపాలిటన్ ప్రాంతాలకే పరిమితం. గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2024 ప్రకారం.. 600 కంటే ఎక్కువ జిల్లాల్లో మెదడు వ్యాధులకు ప్రత్యేక చికిత్సా సౌకర్యాలు అందుబాటులో లేవు. భారత్‌లో నాడీ సంబంధిత వ్యాధులు కేవలం ఆరోగ్య సమస్యగానే కాకుండా.. సామాజిక, ఆర్థిక విపత్తుగా మారుతున్నాయని నివేదిక హెచ్చరిస్తోంది. మెదడు ఆరోగ్యాన్ని ఇప్పుడు జాతీయ ఆరోగ్య విధానంలో కేంద్రంగా ఉంచకపోతే.. అది 2035 నాటికి మరణానికి, వైకల్యానికి ప్రధాన కారణం కావొచ్చు. మెదడు ఆరోగ్యాన్ని నిపుణుల ఆధారిత ఆందోళనగా కాకుండా.. ప్రజారోగ్య హక్కుగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.