Mutton Vs Chicken | మన శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం. మన శరీరం అనేక అవసరాలను తీర్చడంలో ప్రోటీన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన శరీర వయసు, బరువును బట్టి ప్రోటీన్ అవసరం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. జంతు సంబంధిత ఆహారాలతో పాటు మొక్క ఆధారిత ఆహారాల ద్వారా కూడా మనం ప్రోటీన్ ను పొందవచ్చు. చికెన్, మటన్, చేపలు, గుడ్లు వంటి జంతు సంబంధిత ఆహారాలు మన శరీర ప్రోటీన్ అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి. జంతువుల కొవ్వులు సాధారణంగా ప్రోటీన్లతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే మనలో చాలా మందికి ఏ మాంసం ప్రోటీన్ కు మంచి మూలం అనే సందేహం కలుగుతుంది. చికెన్ లేదా మటన్ వీటిలో ప్రోటీన్ కు మంచి మూలం ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అక్టోబర్ 2024 లో ఉదహరించిన అధ్యయనం ప్రకారం మటన్ ను తీసుకోవడం వల్ల ప్రోటీన్ లభించినప్పటికీ ఇది శరీర బరువును పెంచుతుంది అని పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో 60 అల్బినో ఎలుకలను నాలుగు గ్రూపులుగా విభజించారు. శరీర బరువు, క్యాలరీలు తీసుకోవడం, సీరం మార్కర్లు, కాలేయ హిస్టోపాథాలజీ ఇలా వాటిపై అన్ని రకాల పరీక్షలు చేశారు. కొవ్వులు లేని ప్రామాణిక ఆహారం ఇచ్చిన సమూహంతో పోలిస్తే మటన్ ఇచ్చిన ఎలుకల శరీర బరువు పెరిగిందని ఫలితాలు వెల్లడించాయి. అంతేకాకుండా మటన్ ఇచ్చిన ఎలుకల్లో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం, ట్రైగ్లిజరాయిడ్స్, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ స్థాయిలు పెరగడం, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం, కాలేయ నష్టం, కొవ్వు పేరుకుపోవడం వంటి ఇతర సమస్యలు తలెత్తతాయని వారు కనుగొన్నారు.
మటన్ ను తీసుకోవడం వల్ల ప్రోటీన్ లభించినప్పటికీ ఇది ప్రోటీన్ కు మంచి మూలం కాదని తెలుస్తుంది. ఇది అధిక కొవ్వు కలిగిన పదార్థం కనుక దీనిని తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇక చికెన్ విషయానికి వస్తే చికెన్ ఒక్కో శరీర భాగం ఒక్కో విధంగా క్యాలరీలను కలిగి ఉంటుంది. చికెన్ చెస్ట్ లో ఒక విధంగా, తొడలు, రెక్కలు వంటి భాగాలలో ఒక విధంగా క్యాలరీలను కలిగి ఉంటాయి. నేషనల్ చికెన్ కౌన్సిల్ ప్రకారం చికెన్ లీన్ ప్రోటీన్. ఇందులో అధిక కొవ్వు ఉండదు. అలాగే ఇందులో కార్బొహైడ్రేట్స్, పైబర్ కూడా ఉండవు. చికెన్ లో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి చికెన్ ఎంతో మేలు చేస్తుంది.
కనుక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే మనం చికెన్ ను తీసుకోవడమే మంచిది. అధిక శరీర బరువు, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వారు ప్రోటీన్ అవసరాలకు చికెన్ పై ఆధారపడడమే మంచిది. అయితే మితంగా తీసుకోవడం వల్ల రెండూ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.