Heart Failure Symptoms | కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్.. దీన్నే సీహెచ్ఎఫ్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ అని కూడా పిలుస్తారు. ఈ పరిస్థితిలో గుండె రక్తాన్ని పంపు చేసే సామర్థ్యం కోల్పోతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండడం, వ్యాయామం అతిగా చేయడం, ధూమపానం, మద్యపానం వంటి అనేక కారణాల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. దీని వల్ల గుండె పోటు వచ్చి ప్రాణాంతకం అవుతుంది. ప్రస్తుతం చాలా మంది ఈ రకంగా చనిపోతున్నారు కూడా. అయితే హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి ముందే మన శరీరం కొన్ని సంకేతాలను, లక్షణాలను తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా హార్ట్ ఫెయిల్ అవబోతుందని నిర్దారించుకోవచ్చు. దీంతో ముందుగానే జాగ్రత్త పడితే గుండె పోటు రాకుండా అడ్డుకోవచ్చు. దీంతో ప్రాణాలను నిలుపుకోవచ్చు.
మెట్లు ఎక్కుతున్నప్పుడు లేదా ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు లేదా వెల్లకిలా పడుకున్నప్పుడు ఉన్నట్లుండి సడెన్‌గా మీకు శ్వాస లభించనట్లు అవుతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు గనక కనిపిస్తుంటే వీరి గుండె ప్రమాదంలో ఉందని గ్రహించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. అలాగే కొందరు చిన్న పని చేసినా అలసిపోతుంటారు. విపరీతమైన అలసట, నీరసం వస్తాయి. ఈ లక్షణాలు కూడా హార్ట్ ఎటాక్ రాబోతుందని తెలియజేస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నా సరే ఆలస్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది.
గుండె పోటు రాబోయే ముందు లేదా హార్ట్ ఫెయిల్ అయ్యే ముందు శరీరంలో ఎక్కడ చూసినా వాపులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి. అలాగే పొట్టంతా ఉబ్బరంగా అనిపిస్తుంది. రక్త నాళాలు బయటకు కనిపిస్తాయి. మెడ దగ్గర కూడా ఈ విధంగా జరుగుతుంది. శరీరంలో ద్రవాలు ఎక్కువగా చేరడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఇది హార్ట్ ఎటాక్ రాబోతుందని చెప్పే సంకేతమే. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. రక్తాన్ని వేగంగా పంప్ చేస్తుంది కనుక గుండె కొట్టుకునే శబ్దం మీది మీకే వినిపిస్తుంది. గుండెల్లో దడ వచ్చినట్లు అనిపిస్తుంది. ఇది కూడా హార్ట్ ఎటాక్‌కు సంకేతమే.
హార్ట్ ఫెయిల్ అయితే వాకింగ్ చేయడం కష్టంగా మారుతుంది. అడుగు తీసి అడుగు వేయాలంటేనే తీవ్రమైన ఇబ్బందిగా ఉంటుంది. ఈ లక్షణం కనిపించిన జాగ్రత్త పడాలి. శ్వాస తీసుకునే సమయంలో శబ్దాలు వస్తుంటాయి. చీదినట్లు లేదా ఊదినట్లు శబ్దాలు వస్తుంటాయి. ఇలా వస్తున్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్‌గా అనుమానించాలి. అలాగే హార్ట్ ఫెయిల్ అయిన వారిలో కొందరికి దగ్గు కూడా వస్తుంది. దగ్గుతోపాటు కళ్లెలో రక్తం పడుతుంది. ఇలా గనక జరిగితే కచ్చితంగా హార్ట్ ఎటాక్‌గా భావించాలి. హార్ట్ ఎటాక్ రాబోయే ముందు పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ఎంతలా అంటే ఒక పుచ్చకాయను పొట్టలో పెట్టినట్లు అవుతుంది. అలాగే ఛాతిపై ఏదైనా బరువును పెట్టినట్లు భారంగా కూడా అనిపిస్తుంది. ఎడమ దవడల్లో నొప్పి ప్రారంభమై మెడ మీదుగా అది ఎడమ భుజం నుంచి చేతి కిందకు వ్యాపిస్తుంది. ఇది కచ్చితంగా హార్ట్ ఎటాక్ నొప్పే. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే ఎవరైనా సరే వెంటనే అప్రమత్తం అవ్వాలి. వీలైనంత త్వరగా బాధితులను హాస్పిటల్‌కు తీసుకెళ్తే.. ప్రాణాపాయం నుంచి రక్షించుకోవచ్చు.