పెద్ద కోత లేకుండా చిన్నపాటి రంధ్రంతో గుండెకు చేసే శస్త్రచికిత్స విధానాన్నే మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే గుండె శస్త్రచికిత్సలో ఛాతీలోని ఎముకను కత్తిరించకుండా చిన్నపాటి రంధ్రంతో శస్త్రచికిత్సను పూర్తిచేస్తారన్నమాట. అందుకే దీన్ని మినిమల్లీ ఇన్వేసివ్ హార్ట్ సర్జరీ, కీహోల్ హార్ట్ సర్జరీ అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిలో ఛాతీ భాగంలో ఒకటి లేదా రెండు రంధ్రాలు చేస్తారు. చిన్న కెమెరాలు, రోబోటిక్ పరికరాలు, ఇతర సర్జరీ సాధనాలను చిన్నపాటి రంధ్రాల ద్వారా పక్కటెముకల మధ్య ఉన్న గుండె దగ్గరికి పంపిస్తారు.
సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది ప్రామాణిక విధానం. ఈ పద్ధతిలో ఛాతీ మధ్యభాగంలో ఎముకను కత్తిరిస్తారు. దీన్ని వైద్య పరిభాషలో ‘స్టెర్నోటమీ’ అంటారు. దీనివల్ల వైద్యులు గుండెను నేరుగా తమ కళ్లతో స్పష్టంగా చూడగలుగుతారు. అందుకే దీనికి ఓపెన్ హార్ట్ సర్జరీ అనే పేరు వచ్చింది. సాధారణంగా, స్టెర్నోటమీ కోతలు ఎనిమిది నుంచి పది అంగుళాల పొడవు ఉంటాయి. అంటే ఛాతీ భాగంలో 10 నుంచి 15 సెంటీమీటర్ల వ్యాసార్థం మేరకు కోత పెట్టాల్సి ఉంటుంది.
కీహోల్ హార్ట్ సర్జరీలో భాగంగా తొలుత ఛాతీ భాగంలో 5 నుంచి 6 సెంటీమీటర్ల రంధ్రం చేస్తారు. ఈ రంధ్రాన్ని వైద్య పరిభాషలో ‘వర్కింగ్ పోర్ట్’ అంటారు. ఇందులోంచే సర్జరీ చేస్తారు. ఈ వర్కింగ్ పోర్ట్ పక్కనే పక్కటెముకల మధ్య అదనంగా మరో 2 నుంచి 4 సెంటీమీటర్ల చిన్నపాటి రంధ్రం చేస్తారు. ఈ చిన్నపాటి రంధ్రాన్ని మినీథొరాకొటమీ అంటారు. కీహోల్ హార్ట్ సర్జరీ ప్రక్రియలో భాగంగా వర్కింగ్ పోర్ట్ నుంచి థొరాకోసోప్ అనే సన్నటి పొడవైన ట్యూబ్‌ను గుండె దగ్గరికి పంపిస్తారు. అనంతరం మినీథొరాకొటమీ రంధ్రంలోంచి టెలిస్కోప్, రోబోటిక్ చేతులను పంపిస్తారు. ఇలా పంపిన టెలిస్కోప్ ద్వారా గుండెలో ఉన్న సమస్యను మానిటర్లో స్పష్టంగా చూస్తూ, వర్కింగ్ పోర్ట్ ద్వారా పంపిన థొరాకోస్కోప్ ద్వారా శస్త్రచికిత్స జరుపుతారు. ఈ సర్జరీ చేయడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఇంకొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు.
గుండె బయట ఉండే ‘పెరికార్డియం’ అనే పొర గుండెకు రక్షణ కవచంగా ఉంటుంది. అయితే, పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉన్న రోగులకు కీహోల్ హార్ట్ సర్జరీ పద్ధతిలో భాగంగా గుండె బయట ఉన్న ‘పెరికార్డియం’ లోంచి చిన్నముక్కను తీసుకుని గుండెకు ఉన్న రంధ్రాన్ని
మూసివేస్తారు.
గుండె వాల్వ్ (కవాటం)కు మరమ్మతు అవసరమైతే… కీహోల్ పద్ధతిలోనే దెబ్బతిన్న వాల్వ్‌కు కుట్టు వేస్తారు. అదే వాల్వ్‌ను రీప్లేస్ చేయాల్సి వస్తే దాన్ని పూర్తిగా కత్తిరించేసి, కృత్రిమ వాల్వ్‌ను అమరుస్తారు. ఈ సర్జరీని పిల్లలు, పెద్దల్లో కూడా చేయవచ్చు.
ఓపెన్ హార్ట్ సర్జరీలో ఛాతీ భాగంలో ఉన్న ఎముకను కత్తిరించాల్సి ఉంటుంది. అందుకోసం ఛాతీపై వైద్యులు కనీసం 10 నుంచి 15 సెంటీమీటర్ల మేర కోత పెడతారు. దీనివల్ల తీవ్రమైన నొప్పితో ఎక్కువ రోజులు గడపాల్సి ఉంటుంది. అదే కీహోల్ పద్ధతిలో అయితే ఛాతీ భాగంలో ఎముకను కత్తిరించాల్సిన అవసరం ఉండదు. పెద్ద కోత పెట్టాల్సిన అవసరమూ పడదు. కేవలం పక్కటెముకల (రిబ్స్) మధ్యలో చిన్నపాటి రంధ్రం చేసి థొరాకోస్కోపి ద్వారా సర్జరీ చేస్తారు. ఓపెన్ పద్ధతిలో అయితే గుండె సమస్యను నేరుగా వైద్యులు కంటితో చూస్తూ సర్జరీ చేయాల్సి ఉంటుంది. కీహోల్ పద్ధతిలో చిన్నపాటి రంధ్రం ద్వారా పంపిన టెలిస్కోప్ ద్వారా మానిటర్లో చూస్తూ సర్జరీ చేస్తారు.
– మహేశ్వర్‌రావు బండారి
– డా. ప్రమోద్‌రెడ్డి కందకురె
క్లినికల్ డైరెక్టర్ కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్, మినిమల్లీ
ఇన్వేసివ్ సర్జన్, కేర్ హాస్పిటల్
గచ్చిబౌలి, హైదరాబాద్