Millet Rotis | చాలా మంది భారతీయులకు రోటీ అనేది రోజు వారి ఆహారమే అని చెప్పవచ్చు. దాని వల్ల కలిగే మేలు , పోషకాల గురించి ఆలోచించకుండా గోధుమ రోటీలని రోజూ తింటూనే ఉంటారు. గోధుమ రోటీలని ఎక్కువగా తీసుకున్నప్పటికీ ఇవి అందరికీ ఎల్లప్పుడూ మేలు చేస్తాయని చెప్పలేం. గోధుమ రోటీలని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, జీర్ణ సమస్యలు, పోషకాహార లోపం వంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. కనుక గోధుమ రోటీలకి బదులుగా తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలతో చేసిన రోటీలను తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ రోటీలు ఒక్కొక్కటి ఒక్కో రుచిని, ఆరోగ్యప్రయోజనాలను అందిస్తాయని వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గోధుమ రోటీలకు బదులుగా మనం తీసుకోదగిన ఇతర రోటీలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం గోధుమలకు బదులుగా సజ్జలతో చేసిన రోటీలను కూడా తీసుకోవచ్చు. సజ్జల్లో ఐరన్, మెగ్నీషియం, ఫ్లేవనాయిడ్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైటో న్యూట్రియెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. సజ్జ రోటీలను తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం బలంగా తయారవుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్న వారికి సజ్జ రోటీలు ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే జొన్నల్లో కూడా ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, బి విటమిన్లు వంటి పోషకాలు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి గ్లూటెన్ రహితమైనవి కనుక గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. జొన్న రొట్టెలను తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఎముకల ఆరోగ్యానికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా చేయడంలో సహాయపడుతుంది. రాగుల్లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది కనుక వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. అతిగా తినడం తగ్గిస్తుంది. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది. రాగి రోటీలను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడంతో పాటు శరీరం దృఢంగా తయారవుతుంది. అదే విధంగా గోధుమరోటీలకు బదులుగా మనం మొక్కజొన్నతో కూడా రోటీలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల త్వరగా శక్తి లభిస్తుంది. అయితే వీటిని మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇక సున్నితమైన జీర్ణక్రియ ఉన్నవారు బియ్యం రోటీలను తీసుకోవచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. పొట్టకు తేలికగా ఉంటాయి. బేసన్ రోటీలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కండరాల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి చిరుతిండి తినాలనే కోరిక తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఓట్స్ మనకు ఎంతో సహాయపడతాయి. ఓట్స్ తో రోటీలను తయారు చేసి తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా మనం గోధుమ రోటీలకు బదులుగా ఇతర ధాన్యాలతో చేసిన రోటీలను కూడా తీసుకోవచ్చని వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.