Migraine | ఇటీవల కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో మైగ్రేన్ ఒకటి. ఇది ఒకరకమైన తలనొప్పి. సాధారణంగా తలకు ఒక వైపున మాత్రమే వస్తుంటుంది. పలు సమయాల్లో రెండు వైపులా నొప్పి వస్తుంటుంది. మైగ్రేన్ సమస్య ఉంటే తలలో ఓ పక్కన తీవ్రమైన నొప్పి లేదంటే జల్లుమన్నట్లుగా అనిపిస్తుంటుంది. తరుచుతూ వికారం, వాంతులతో వచ్చినట్లుగా అనిపిస్తుంది. మైగ్రేన్ సాధారణమైన నాడీ సంబంధిత సమస్య. సాధారణ తలనొప్పి కంటే ఎక్కువగా ఉండే మైగ్రేన్ తలనొప్పికి కూడా తీవ్రమైన శ్రద్ధ అవసరం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ వల్ల వచ్చే సమస్య కూడా కారణం కావొచ్చు. చాలా కాలంగా మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే.. దాన్ని తీవ్రంగా పరిగణించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మైగ్రేన్‌పై దృష్టిపెట్టకపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో సమస్యను గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుందని.. లేకపోతే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ మరణానికి అత్యంత సాధారణ కారణం. భారతదేశంలో ఏటా 1.85 లక్షల మందికిపైగా స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. మైగ్రేన్లు ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. అనేక అధ్యయనాలు మైగ్రేన్, ఇస్కీమిక్ స్ట్రోక్ మధ్య సంబంధానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించాయి. ఎందుకంటే రెండూ రక్త నాళాల సరఫరాకు సంబంధించిన సమస్యలే. మైగ్రేన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రక్షన్, స్ట్రోక్- కార్డియోవాస్కులర్ డెత్ ప్రమాదాన్ని సైతం పెంచుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మైగ్రేన్లతో బాధపడేవారికి గుండెపోటు, కర్ణిక దడ, గుండె దడ రుగ్మతలు వంటి హృదయ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో మైగ్రేన్‌కు సకాలంలో చికిత్స చేయకపోతే ఇది ఇస్కీమిక్ స్ట్రోక్‌కు కారణమవుతుందని పరిశోధకులు బృందం తెలిపింది. ఇది ప్రాణాంతకమైన దుష్ప్రభావంగా మారుతుందని, ఇప్పటికే మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా ఆరోగ్య నిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైగ్రేన్ ఉన్నవారికి వారి జీవితకాలంలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం దాదాపు రెట్టింపు అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అదనంగా దీర్ఘకాలిక మైగ్రేన్ కూడా కొంతమంది వ్యక్తుల్లో జీవన నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, తరచుగా మైగ్రేన్ సమస్యలు ఉన్న వ్యక్తులు, మానసిక ఆరోగ్యం, నిద్ర సమస్యల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొంటున్నారు.
మైగ్రేన్ తలనొప్పి కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఉంటుందని, దీర్ఘకాలిక మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మీరు మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందేందుకు పలు చిట్కాలు పాటించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. తలనొప్పి వస్తుంటే.. అందుకు ప్రేరేపించే సమస్యలపై తెలుసుకోండి. నివారణ చర్యలు పాటిస్తూ ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఏ సమయంలోనైనా భోజనం తీసుకోవడంలో అశ్రద్ధ చేయొద్దు. కెఫీన్ అధికంగా తీసుకోవడంతో కొంతమందిలో మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కెఫీన్‌ను అధికంగా తీసుకోవడం మానివేయాలి. ఎక్కువగా టీ, కాఫీ వంటివి తీసుకునే అలవాటు ఉంటే.. తక్కువ చేయడం చాలా ముఖ్యం.