Mens Health | మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తినాలన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాహారం తింటేనే మన శరీరానికి కావల్సిన పోషకాలు లభించి మనం శక్తివంతంగా ఉంటాం. ఉత్సాహంగా పనిచేస్తాం. అలాగే రోగాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అయితే పురుషుల ఆరోగ్యం విషయానికి వస్తే వారు కొన్ని రకాల ఆహారాలను తినకూడదు. అవి వారి ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా సంతానం పొందాలని చూస్తున్న పురుషులు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే అది వారి సంతాన సాఫల్యతపై ప్రభావం చూపిస్తుంది. వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు తగ్గుతాయి. కనుక పురుషులు తాము రోజూ తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఏయే ఆహారాలను వారు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాసెస్ చేయబడిన మాంసాహారం తింటే పురుషుల ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. బేకరీలు, ఫుడ్ కోర్టులు, ఇతర ప్రదేశాల్లో లభించే ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను తింటే పురుషుల్లో వీర్యం శాతం తగ్గుతుందని, శుక్ర కణాల నాణ్యత కూడా తగ్గుతుందని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. కనుక తరచూ ఇలాంటి ఫుడ్స్‌ను తింటున్న పురుషులు ఇకనైనా వాటికి దూరంగా ఉండాలి. లేదంటే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే కొవ్వు ఎక్కువగా కలిగిన పాలు, క్రీమ్, చీజ్ వంటి ఉత్పత్తులను తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. అందుకనే కొందరు బాలురు చిన్నతనంలోనే ఊబకాయంతో ఉంటారు. వారిలో ఛాతి కూడా బాలికల్లా పెరిగి కనిపిస్తుంది. ఇవన్నీ హార్మోన్ల అసమతుల్యత వచ్చే సమస్యలు. కనుక పురుషులు ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది.
సోయా ఉత్పత్తులకు కూడా పురుషులు దూరంగా ఉండాలి. ఇవి కూడా వారిలో హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తాయి. సోయా తోఫు, సోయా పాలు, మీల్ మేకర్ వంటి ఆహారాలను తీసుకోకూడదు. ఇవి ఫైటో ఈస్ట్రోజన్స్ అనే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి స్త్రీ హార్మోన్లను ప్రేరేపిస్తాయి. కనుక పురుషులు ఈ ఆహారాలను తీసుకుంటే వారిలో స్త్రీ హార్మోన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి పురుషులు సోయా ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాలి. అలాగే చేపలను తినే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కాలుష్యం అధికంగా ఉండే చెరువులు లేదా నదుల నుంచి పట్టుకు వచ్చిన చేపల్లో పాదరసం, ఇతర టాక్సిన్లు, భార లోహాలు అధికంగా ఉండే ప్రమాదం ఉంటుంది. అలాంటి చేపలను తింటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది సంతాన లోపానిక దారి తీస్తుంది. కనుక చేపలను తినే పురుషులు ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడో ఒకసారి రెండు పెగ్గులు లేదా 300 ఎంఎల్ మోతాదులో బీర్ వంటివి సేవిస్తే ఆరోగ్యానికి ప్రయోజనమే కలుగుతుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. కానీ చాలా మంది పురుషులు లిమిట్ దాటి మద్యం సేవిస్తుంటారు. కొందరు రోజూ విపరీతంగా మద్యం సేవిస్తుంటారు. ఇది పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మద్యాన్ని అధికంగా సేవిస్తే పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. వీర్యం ఉత్పత్తి, శుక్ర కణాల నాణ్యత కూడా తగ్గిపోతాయి. ఇది పురుషుల్లో సంతాన లోపానికి కారణం అవుతుంది. కాబట్టి మద్యాన్ని మితంగా సేవించాలి. లేదా పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కృత్రిమ పదార్థాలు వేసి తయారు చేసిన జ్యూస్‌లకు కూడా పురుషులు దూరంగా ఉండాలి. ఇలా కొన్ని రకాల ఆహారాలకు పురుషులు దూరంగా ఉంటే వారిలో సంతాన లోపం సమస్య రాకుండా అడ్డుకోవచ్చు.