రుషులు నిర్దేశించిన మార్గం ధ్యానం. గౌతమ బుద్ధుడు అనుసరించిన పథం ధ్యానం. విశిష్ట జీవనానికి మన పూర్వికులు ఈ జాతికి అందించిన పరుసవేది ఈ సాధన. మనసును ప్రశాంత స్థితికి తీసుకొచ్చి మన శక్తిని ఉద్దీపనం చేసే అస్త్రమిది. ధ్యానం ప్రధాన లక్ష్యం జీవితం పట్ల అవగాహన పెంచుకోవడమే! మన ఆలోచనలపై అదుపు సాధించడం వల్ల మనసుకు, శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస ఒక పద్ధతైతే.. ఆలోచనలను అధిగమించే విధానం మరొకటి. మార్గమేదైనా ధ్యానాన్ని ఆశ్రయిస్తే.. జీవితం ఆరోగ్యంగా సాగిపోవడం ఖాయం.
ఆధునిక స్త్రీలు ఇంటి బాధ్యతలతోపాటు ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తూ కాలంతోపాటే పరుగులు తీస్తున్న వాతావరణం ఇప్పుడు మామూలు విషయమైపోయింది. ఒత్తిళ్లతో కూడిన వాతావరణంలో మహిళలు తమ మానసిక, శారీరక ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో నవతరం నారీమణుల మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం ఓ మంచి ఉపకరణంగా నిలుస్తుంది. ధ్యానం చేయడంలో అనుసరించాల్సిన విధానాలు వేర్వేరు రకాలుగా ఉంటాయి.
ముక్కు పుటాల గుండా జరిగే శ్వాసక్రియ (ఉచ్ఛాస, నిశ్వాస) క్రమాన్ని అలా గమనిస్తూ ఉండిపోవాలి. లేదంటే శ్వాసిస్తున్న క్రమాన్ని మనసులో లెక్కిస్తూ ఉండాలి. ఇలా చేస్తే మనసు మీద అదుపు వస్తుంది.
దీన్ని మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటారు. ఇందులో గతం, భవిష్యత్తుల గురించిన ఆలోచనలు వదిలిపెట్టి కేవలం వర్తమానంపై దృష్టి సారించాలి. ఆలోచనలు, మానసిక స్పందనలు, పరిసరాల మీద పూర్తి ఎరుకతో ఉండాలి. ఇలా చేయడం జీవితాన్ని యథాతథంగా ఆమోదించి ముందుకు వెళ్లడానికి దోహదపడుతుంది. ఆలోచనలు, భావోద్వేగాల పట్ల ఎరుకతో ఉండటం వల్ల స్త్రీలు తమ గురించి తాము అవగాహన చేసుకుని, జీవితంలో వివిధ సందర్భాల్లో ఎలా స్పందించాలో తెలుసుకోగల్గుతారు.
మనసులో రోజువారీ జీవితంలో తలెత్తే గందరగోళాన్ని, గజిబిజి ఆలోచనలను ఖాళీ చేసుకోవాలి. మనసును ఆలోచన రహిత స్థితికి తెచ్చుకోవాలి. లేదంటే ఆలోచనలను అలా బయటికి స్వేచ్ఛగా వెళ్లిపోనివ్వాలి.
ఓ చెట్టును కానీ, దీపశిఖను కానీ లేదంటే ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన వస్తువును కానీ అలా చూస్తూ ఉండటం ద్వారా కూడా మనసుపై పట్టు సాధించవచ్చు. అయితే ఇక్కడ మనం చూసే వస్తువు పట్ల ఎరుకతో ఉండాలి. ఆలోచనలను బలవంతంగా తొక్కిపట్టే ప్రయత్నం చేయకూడదు. అలా మనసును స్వేచ్ఛగా వదిలివేయాలి. కాసేపటికి అదే నెమ్మదిస్తుంది.
మన పట్ల మనం, ఇతరుల పట్ల ప్రేమగా, దయతో మెలగడమూ ధ్యానమే. దీనివల్ల మన మీద మనకే కాకుండా ఎదుటివారి పట్ల సహానుభూతి, సానుభూతి, దయాగుణం అలవడతాయి. ఇది స్త్రీలు తమ మనోస్థితిని సానుకూలంగా మార్చుకుని ఇతరులతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు దోహదపడుతుంది.
ఓ మంత్రాన్ని లేదంటే పదాన్ని, పదబంధాన్ని ఉచ్చరించడం కూడా ధ్యానమే. దీనివల్ల మనసుకు ఉపశమనం దొరుకుతుంది. మన గురించి మనకు ఎరుక ఏర్పడుతుంది. నామాన్ని ఉచ్చరించడం వల్ల ఒత్తిడి, ఆందోళన లాంటివి దూరమైపోతాయి. మనసు స్థిమిత
పడుతుంది.
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ధ్యానంతో మానసిక, భావోద్వేగపరమైన, శారీరకపరమైన ఆరోగ్యం చేకూరుతుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళన దూరమైపోతాయి. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మానసికంగా స్పష్టత వస్తుంది. ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు భావోద్వేగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక శారీరకంగా చూస్తే ధ్యానం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. అలా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, ధ్యానం ఇచ్చే ప్రయోజనాలను పెంచుకోవాలని అనుకుంటే రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లకు చోటివ్వాలి.
పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా శారీరక, మానసిక వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే జీవితంలో నాణ్యత కూడా పెరుగుతుంది. ధ్యానం వల్ల నిద్ర కూడా గాఢంగా పడుతుంది. దీంతో మేధో సామర్థ్యం పెరుగుతుంది. ఇవి మాత్రమే కాదు… ఆహారం తినడాన్నీ ఓ ధ్యానంలాగే పూర్తిచేయాలి. ఆహారం రుచి, రంగు, వాసనను ముద్దముద్దలో ఆస్వాదిస్తూ తినాలి. జీవితం అంటే గమ్యం కాదు ప్రయాణం అని గుర్తుంచుకోవాలి. దీన్ని గుర్తిస్తే చాలు జీవితయాత్ర ఆనందంగా, ఆరోగ్యకరంగా సాగిపోతుంది. ఈ క్రమంలో ధ్యానం, యోగా లాంటివి తమవంతు సాయం చేస్తాయి. ధ్యానం కోసం