ప్రపంచ ప్రసిద్ధ వైజ్ఞానిక పత్రిక ‘సైన్స్ డైలీ’లో ప్రచురితమైన ఒక సరికొత్త వైద్య పరిశోధన మానవ ఆరోగ్య భవిష్యత్తును మార్చేయబోతున్నది. వృద్ధాప్యం లేదా గాయాల వల్ల అరిగిపోయిన కీళ్లలోని మృదులాస్థి కణజాలాన్ని (కార్టిలేజ్) తిరిగి సహజంగా పునరుత్పత్తి చేసే సరికొత్త చికిత్సను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భవిష్యత్తులో ఆర్థరైటిస్ (కీళ్ల వాతం)ను పూర్తిగా నివారించేందుకు, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల అవసరం లేకుండా చేసేందుకు ఈ ఆవిష్కరణ ఒక మార్గదర్శి కానుంది. ఈ పరిశోధనను అమెరికాలోని ప్రముఖ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది.
ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో వృద్ధ ఎలుకలపై సుదీర్ఘ ప్రయోగాలు చేయడమే కాకుండా, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న వందలాది మంది మానవ కీళ్ల కణజాల నమూనాలను సేకరించి వాటిపై కూడా ఈ ప్రయోగాలు చేశారు. ఈ పరిశోధన కోసం వృద్ధాప్యంలో కణాలు ఎలా క్షీణిస్తాయో తెలుసుకోవడానికి మిలియన్ల కొద్దీ కణాల జన్యువుల మార్పులను శాస్త్రవేత్తలు చాలా కాలం పాటు పర్యవేక్షించారు.
ఇందులో భాగంగా, వయసు పెరిగే కొద్దీ కీళ్లలో 15-పీజీడీహెచ్ అనే ప్రత్యేక ప్రొటీన్ పెరిగిపోయి, అది కీళ్లలోని కొల్లాజెన్‌ను నాశనం చేస్తున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే, ఈ ప్రొటీన్‌ను బ్లాక్ చేసే ఒక సరికొత్త చికిత్సను అందించగా, అరిగిపోయిన మోకాలి కణజాలం తిరిగి వృద్ధి చెందడం ప్రారంభమైంది. ఈ చికిత్స ద్వారా కేవలం ఒక చిన్న ఇంజెక్షన్ లేదా మాత్రతోనే దెబ్బతిన్న కీళ్లను మళ్లీ మునుపటిలా మార్చవచ్చని రుజువైంది. వృద్ధాప్యాన్ని జయించి, కీళ్ల నొప్పులు లేని సరికొత్త భవిష్యత్తు వైపు మానవాళి అడుగులు వేయడానికి ఈ స్టాన్ఫోర్డ్ పరిశోధన ఒక సంజీవనిలా నిలవనుంది.