‘జంక్ ఫుడ్’తో పెద్దపేగుల ఆరోగ్యం దెబ్బతింటున్నది. చిన్నపిల్లల్లోనూ గ్యాస్ ట్రబుల్, అల్సర్ లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దాంతో, దీర్ఘకాలంపాటు సప్లిమెంట్లు, మందులు వాడాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. అయితే, చిన్నచిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా ‘గట్ హెల్త్’ను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అల్పాహారంలో పులియబెట్టిన ఆహార పదార్థాలకు చోటివ్వాలి. పెరుగన్నం, ఇడ్లీ, దోస లాంటివి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను అందిస్తాయి. అవి పేగుల
ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి.
ఎంత ఇష్టమున్న ఆహారమైనా.. కడుపు నిండుగా తినొద్దు. కనీసం 20 శాతమైనా కడుపు ఖాళీగా ఉంచాలి. అప్పుడే.. త్వరగా జీర్ణమవుతుంది.
ఆహారాన్ని మనసు పెట్టి తినాలి. టీవీ చూస్తూనో, ఫోన్ మాట్లాడుతూనో తింటే.. ఆహారం ఒంటికి పట్టదు. అలా తిన్నప్పుడు.. కడుపు ఉబ్బరంగా, ఒళ్లంతా బరువుగా అనిపిస్తుంది. ఆహారం జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఉదయంపూట 10 నిమిషాలపాటు సూర్యరశ్మిలో గడపాలి. దానివల్ల శరీర సిర్కాడియన్ రిథమ్ నియంత్రణలో ఉంటుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణంకావడానికి మద్దతునిస్తుంది.
ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఒక్కో ముద్దును కనీసం 20 సార్లు నమలాలి. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. పోషకాల శోషణ పెరుగుతుంది. అంతేకాకుండా.. నెమ్మదిగా, బాగా నమిలి తినడం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో, అతిగా తినడం తగ్గి.. బరువు నియంత్రణలో ఉంటుంది.
ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు చిన్నగా నడవాలి. ఈ అలవాటు వల్ల కడుపు, పేగుల ద్వారా ఆహారం సజావుగా కదులుతుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం తర్వాత మగతను నివారిస్తుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.
రోజూ ఒకే సమయానికి ఆహారం తినేలా ప్లాన్ చేసుకోవాలి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటలలోపు.. 12 గంటల భోజన సమయాన్ని అనుసరించడం మంచిది.
కంటినిండా నిద్ర కూడా పేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రి 10 గంటలకు ముందే పడుకోవడం మంచిది. ఆలస్యంగా నిద్రపోవడం.. జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
పుస్తకాలు చదవడం, సంగీతం వినడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయులు తగ్గుతాయి. పేగుల ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి.