Monk Fast | ఆ మధ్య యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి రుషి సునక్ తాను ప్రతీ వారం 36 గంటలపాటు ఉపవాసం ఉంటానని చెప్పారు. ఆ సమయంలో కేవలం నీళ్లు, చాయ్, బ్లాక్ కాఫీ తీసుకుంటానని తెలిపారు. ఆయన తన ఉపవాస వ్రతానికి ప్రత్యేకంగా ఏ పేరూ చెప్పకపోయినా… దాన్ని బౌద్ధ మతానికి చెందిన ‘మాంక్ ఫాస్ట్’తో ముడిపెట్టారు. అలా మీడియాలో ‘మాంక్ ఫాస్ట్’ ఒక్కసారిగా మార్మోగింది. అసలేంటీ మాంక్ ఫాస్టింగ్, దాని మంచిచెడ్డల గురించి తెలుసుకుందాం.
ప్రతి వారం ఓ 36 గంటలపాటు తిండికి పూర్తిగా దూరం ఉండటాన్నే మాంక్ ఫాస్ట్‌గా పేర్కొంటారు. ఈ సమయంలో నీళ్లు, చాయ్ లేదంటే బ్లాక్ కాఫీ లాంటి క్యాలరీలు లేని పానీయాలను సేవించాలి. ఇలా చేస్తే శరీరంలో తగినంత హైడ్రేషన్ ఉంటుంది.
నిపుణుల ప్రకారం సోమవారం సాయంత్రం భోజనం తర్వాత మాంక్ ఫాస్ట్ మొదలుపెట్టాలి. మంగళవారం అంతా ఉపవాసం చేయాలి. బుధవారం పొద్దునే తేలికపాటి అల్పాహారంతో విరమించాలి. అయితే, ఎవరి వీలును బట్టి వాళ్లు చేసుకోవచ్చు.
లాభాలు ఉన్నట్టే మాంక్ ఫాస్ట్ వల్ల సమస్యలూ ఉన్నాయి. వారంలో ఒకటి రెండు రోజుల ఉపవాసాల వల్ల స్కెలిటల్ కండరాల్లో ఇన్సులిన్ నిరోధకత పెరుగుదలకు దారితీస్తుంది. ఇంకా ఊబకాయులకు మాంక్ ఫాస్ట్ మంచి మూడ్‌కు కారణమవుతే, మామూలు వాళ్లకు చికాకు, ఏకాగ్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్త్రీలలో కొంతమందిలో రుతుచక్రంలో మార్పులు తలెత్తవచ్చు కూడా. ఇలా ఉంటే కొంతమంది ఉపవాసం ఉండేవాళ్లు మిగిలిన రోజుల్లో పరిమితికి మించి పళ్లాలకు పళ్లాలు తినేస్తారు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
కాబట్టి… బరువు తక్కువగా ఉన్నవాళ్లు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, తిండి సంబంధ రుగ్మతలు ఉన్నవాళ్లు, ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవాళ్లు మామూలు ఆహార విధానాన్నే అనుసరించాలి. మాంక్ ఫాస్ట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. మిగిలిన వాళ్లు ఉపవాసం చేసేటప్పుడు శరీరంలో తగినంత హైడ్రేషన్ ఉండేలా జాగ్రత్తపడాలి. లేకుంటే డీహైడ్రేషన్‌తో దవాఖాన పాలుకావాల్సి వస్తుంది. ఉపవాసాలు చేపట్టేప్పుడు ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. ఆ తర్వాతే తగిన విధానాన్ని ఎంచుకోవాలి. సొంత నిర్ణయాలు మంచిది కాదు.