Cancer treatment | క్యాన్సర్.. ఇప్పుడీ మొండి వ్యాధి చాలా మందిలో కనిపిస్తూ మనల్ని మరింత భయపెడుతున్నాయి. గుండె జబ్బుల తర్వాత క్యాన్సర్ల కారణంగానే ఎక్కువ మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. మన శరీరంలోకి కణాలు పుడుతూ చనిపోతుంటాయి. కొన్ని కణాలు మాత్రం చనిపోకుండా అసాధారణంగా పెరగడం ప్రారంభమవుతాయి. దీనినే క్యాన్సర్‌గా పిలుస్తారు. వైద్య విధానంలో ఎన్నో అధునాతన చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో క్యాన్సర్లను తొలి దశలో గుర్తించడం ద్వారా మరింత పెరగకుండా నిరోధించే అవకాశాలు అందివచ్చాయి. కాగా, ఇటీవలి అధ్యయనం ప్రకారం క్యాన్సర్ పెరుగుదల అంతర్లీన విధానాలను అర్ధం చేసుకోవడం ద్వారా చికిత్స అందించడం సులువని వెల్లడైంది.
ఈ అధ్యయనం నేచర్ స్ట్రక్చరల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పత్రికలో ప్రచురితమైంది. చర్మం, మెదడు క్యాన్సర్లతోపాటు అనేక క్యాన్సర్ రకాలను కలిగి ఉండే నిర్దిష్ట పరమాణు మార్గాన్ని ఈ అధ్యయనంలో గుర్తించారు. హెడ్జ్హాగ్ పాత్వే అని పిలువబడే అవయవ అభివృద్ధిలో కీలకమైన సిగ్నలింగ్ మార్గాన్ని పరిశోధకులు విశ్లేషించారు.
హంట్స్‌మన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లోని ఆంకోలాజికల్ సైన్సెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యయన రచయిత డాక్టర్ బెంజమిన్ మైయర్స్ ఈ పరిశోధనను వివరించారు. ‘ఈ అధ్యయనం శరీరంలోని ‘సిగ్నలింగ్ పాత్వే’ అని పిలిచే ఒక వ్యవస్థపై దృష్టి సారించింది. ఈ సిగ్నలింగ్ పాత్వే శరీరం సెల్లో ‘టెలిఫోన్ వైర్’ లా పనిచేస్తుంది. సెల్ వెలుపలి నుంచి లోపలికి ముఖ్యమైన సమాచారాన్ని అందించడంలో సహాయపడుతుంది’ అని చెప్పారు.
ఈ సిగ్నలింగ్ పాత్వేనే హెడ్జ్హాగ్ . శరీరంలోని కణాలు, అవయవాలు సరిగ్గా అభివృద్ధి చెందడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. సిగ్నలింగ్ పాత్వేలో కనిపించే లోపాలు పుట్టుకతో వచ్చే లోపాలు లేదా క్యాన్సర్లకు దారితీయవచ్చునని తమ పరిశోధనలో తేలిందని ఆయన వెల్లడించారు. ఈ హెడ్జ్హాగ్ ను సరిచేయడం ద్వారా చర్మ, మెదడు క్యాన్సర్ల చికిత్సలో విజయం సాధించవచ్చునని తమ పరిశోధక బృందం నమ్ముతున్నట్లు చెప్పారు.