Almond Oil | బాదంపప్పులను తినడం వల్ల ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే బాదంపప్పులతో బాదం నూనెను కూడా తయారు చేస్తారు. ఇందులోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయి. బాదంనూనెలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు ఎ, ఇ లతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఈ నూనెలో అధికంగా ఉంటాయి. ఈ నూనె యాంటీ ఇన్ ఫ్లామేటరీ, ఇమ్యూన్ స్టిమ్యులేటింగ్, యాంటీ హెపాటో టాక్సిక లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక ఈ నూనెను ఎంతో పురాతన కాలం నుంచే సాంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగిస్తున్నారు. బాదంనూనెను రోజూ ఒక టీస్పూన్ సేవించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బాదంనూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బాదంనూనెలో చర్మాన్ని సంరక్షించే గుణాలు ఉన్నాయి. ఈ నూనె మన చర్మానికి బయట, లోపలి నుంచి రక్షణను అందిస్తుంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక చర్మానికి తేమను అందిస్తుంది. ఈ నూనెను రాస్తుంటే పొడి చర్మం మృదువుగా మారుతుంది. చర్మం వాపులు తగ్గిపోతాయి. చర్మ సహజ కాంతి, నిగారింపు పెరుగుతాయి. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం బాదంనూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడు యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. దీంతో నాడీ సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా అల్జీమర్స్ రాకుండా నియంత్రించవచ్చు.
బాదంనూనెను తరచూ జుట్టుకు రాస్తున్నా లేదా లోపలికి తీసుకుంటున్నా కూడా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ నూనెలో ఉండే అనేక ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ నూనె వల్ల తలలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో శిరోజాలకు పోషకాలు సరిగ్గా లభిస్తాయి. ఇది జుట్టును పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది. బాదంనూనెలో క్యాల్షియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే ఆస్టియో పోరోసిస్ రాకుండా నివారించవచ్చు. ఎముకలు బలంగా మారుతాయి.
బాదంనూనె సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. అంటే విరేచనకారిగా పనిచేస్తుందన్నమాట. ఈ నూనెను తాగితే మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. విరేచనం సాఫీగా అవుతుంది. దీంతోపాటు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి బాదంనూనె ఎంతో మేలు చేస్తుంది. దీన్ని రోజూ తీసుకుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. బాదంనూనెలో విటమిన్ ఇ, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. బాదంనూనె చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. బాదంనూనెను తరచూ రాస్తుంటే గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. ఇలా బాదంనూనెతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.