Asafoetida | చాలా మంది కూరల్లో పోపు వేసేటప్పుడు లేదా కూరలు వండేటప్పుడు అందులో ఇంగువను వేస్తుంటారు. ఇంగువను వేస్తే కూరలకు చక్కని రుచి వస్తుంది. ముఖ్యంగా ఇంగువ వేసి తయారు చేసే చింత పండు పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది. ఆలయాల్లోనూ ఇలాగే పులిహోరను వండి ప్రసాదంలా పెడతారు. అయితే ఆయుర్వేద ప్రకారం వాస్తవానికి ఇంగువతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేవలం కూరల్లో వేసే పదార్థంగానే కాదు, ఇది మనకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇంగువను పలు రకాలుగా ఉపయోగించడం వల్ల పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇంగువ కూరలకు మంచి రుచి, వాసనను అందించడమే కాదు, మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ఇంగువను వంటల్లో వేసే సుగంధ ద్రవ్యంగా చెప్పవచ్చు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇంగువను ఆంగ్లంలో అసఫాటిడా అంటారు. అస అంట పర్షియన్లో జిగురు అని, ఫాటిడా అంటే లాటిన్లో ఘాటైన గంధక వాసన అని అర్థాలు వస్తాయి. దీనిని ఇండో ఆర్యన్ భాషల్లో హింగ్, హీంగ్ అని కూడా పిలుస్తారు. పర్షియా దేశంలో మొదట వాడబడిన ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసనను కలిగి ఉంటుంది. వంటల్లో వేసి దీన్ని ఉడికిస్తే మసాలా దినుసు వాసన వస్తుంది. ఇంగువ మొక్కలు ఎక్కువగా ఇరాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల్లో పెరుగుతాయి. మన దేశంలోని పంజాబ్, కాశ్మీర్లలోనూ ఈ మొక్కలను పెంచుతున్నారు. ఇంగువను సంస్కృతంలో హింగు అంటారు.
ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుంచి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. మూడు నెలల్లో తయారైన ద్రవం రాయిలాగా మారుతుంది. ఇది పసుపు రంగులో ఉండి తీవ్రమైన వాసనతో ఉంటుంది. ఇంగువను తెలుగు వారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇంగువలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్, ఐరన్, కెరాటిన్, పలు రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ ఎముకలను బలంగా ఉంచుతాయి. ఇంగువను యునాని వైద్యంలో అధికంగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలోనూ దీన్ని వాడుతారు. ఇంగువను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంగువను గర్భిణీలు తీసుకోరాదు. ఇది గర్భ నిరోధకంగా పనిచేస్తుంది. కానీ మహిళలు వాడవచ్చు. రుతు సమస్యలు పోతాయి.
బాలింతలు ఇంగువను తింటే పాలు బాగా పడతాయి. అజీర్తి సమస్య ఉన్నవారు కూరల్లో ఇంగువను వాడుతుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. కడుపులో మంట కూడా తగ్గుతుంది. మజ్జిగలో కాస్త ఇంగువ పొడి కలిపి తాగుతున్నా కూడా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఒక టీస్పూన్ తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలను కలిపి తీసుకుంటే గొంతు సమస్యలు తగ్గుతాయి. దగ్గు, జలుబు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఇంగువను తింటే ఫలితం ఉంటుంది. ఇంగువను తరచూ వంటల్లో వాడుతుంటే బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. స్త్రీలలో రుతు సమస్యలు తగ్గుతాయి. ఇంగువను రోజూ తింటే వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఆస్తమా నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇలా ఇంగువతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.