Spinach | ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. మనం ఆహారంగా తీసుకునే వివిధ ఆకుకూరలల్లో పాలకూర కూడా ఒకటి. దీనిలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. సలాడ్ రూపంలో, పప్పు, కూర రూపంలో పాలకూరను మనం తీసుకుంటూ ఉంటాం. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మన మొత్తం శరీరానికి పాలకూర చేసే మేలు అంతా ఇంతా కాదు. పాలకూరను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి, అలాగే దీనిని తీసుకోదగిన వివిధ రూపాల గురించి పోషకాహార వైద్య నిపుణులు వివరిస్తున్నారు. పాలకూరలో విటమిన్ ఎ, సి, కె1 లతో పాటు ఫోలేట్, ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పాలకూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం చాలా వరకు తగ్గుతుంది. అలాగే పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీటాకెరోటీన్, లుటీన్, జియాక్సంతిన్, క్లోరోఫిల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడడంలో సహాయపడతాయి. దీంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పాలకూరలో క్యాన్సర్ నివారణకు దోహదపడే సమ్మేళనాలు కూడా ఉంటాయి. కనుక పాలకూరను తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పాలకూర మనకు ఎంతో సహాయపడుతుంది. పాలకూరలో నైట్రేట్ ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది.
అంతేకాకుండా పాలకూరను తీసుకోవడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అలాగే పాలకూర తక్కువ గ్లైసెమిక్ స్థాయిలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పాలకూరలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక చక్కెరలను నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థకు మద్దతును ఇవ్వడంలో కూడా పాలకూర మనకు సహాయపడుతుంది. దీనిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. దీనిలో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల ప్రేగుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పాలకూరలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. నీరు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కనుక పాలకూరను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు. ఈ విధంగా పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇక పాలకూరతో మనం పాలకూర స్టఫ్డ్ చికెన్ బ్రెస్ట్, పాలకూర, పుట్టగొడుగు క్విచే, పాలకూర బెర్రీ స్మూతీ, పాలకూర డిప్ వంటి వాటిని కూడా తయారు చేసి తీసుకోవచ్చు. అయితే మనలో చాలా మంది పాలకూరను తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని చాలా మంది దీనిని పూర్తిగా తీసుకోవడమే మానేస్తారు. కానీ ఇతర ఆకుకూరల లాగా పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని వైద్యులు చెబుతున్నారు.