Potatoes | ఆలుగడ్డలను సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. వీటితో వేపుడు చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే కుర్మా, టమాటా కూర కూడా చేసి తినవచ్చు. ఆలుతో చిప్స్‌ను కూడా తయారు చేసి తింటారు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. కానీ ఆలును వేపుళ్లు, చిప్స్ లాంటి రూపంలో తింటే మనకు జరిగే మేలు ఏమీ ఉండదు. కానీ నష్టం మాత్రం అధికంగా ఉంటుంది. అదే ఆలుగడ్డలను ఉడకబెట్టి లేదా కూరగా చేసి తింటేనే మనకు లాభం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆలుగడ్డల్లో మన శరీరానికి కావల్సిన పలు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఆలుగడ్డల్లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. కనుక ఇవి మనకు శక్తిని అందిస్తాయి. ఒక మీడియం సైజు ఆలుగడ్డలో సుమారుగా 26 గ్రాముల మేర పిండి పదార్థాలు ఉంటాయి.
ఆలుగడ్డను పిండి పదార్థాలకు మంచి నెలవుగా చెప్పవచ్చు. ఇది శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. కానీ అధికంగా తింటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం ఎక్కువగా చేసేవారికి కావల్సిన శక్తిని ఆలుగడ్డలు అందిస్తాయి. కనుక వారు రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. అలాగే ఆలుగడ్డలో ఉండే పలు సమ్మేళనాలు పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా రక్షిస్తాయి. పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆలుగడ్డలను మోతాదులో తింటుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రణలో ఉంచవచ్చు. ఆలుగడ్డలను ఎల్లప్పుడూ ఉడకబెట్టి మాత్రమే తినాలి. వేయించి లేదా పచ్చిగా తినకూడదు. ఇవి సరిగ్గా జీర్ణం కావు.
150 గ్రాముల మేర ఆలుగడ్డలను తింటే 27 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. మనకు రోజుకు కావల్సిన విటమిన్ సి లో ఇది 45 శాతం. అలాగే 630 మిల్లీగ్రాముల మేర పొటాషియం, 0.2 మిల్లీగ్రాముల విటమిన్ బి6, స్వల్ప మోతాదులో థయామిన్, రైబోఫ్లేవిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నిషియం, ఐరన్, జింక్ తదితర పోషకాలు వీటి ద్వారా లభిస్తాయి. ఆలుగడ్డలను పైన పొట్టుతో తింటే మేలు. చాలా మంది పొట్టు తీసేసి తింటారు. దీని వల్ల అనేక పోషకాలను, ముఖ్యంగా ఫైబర్‌ను కోల్పోవాల్సి వస్తుంది. ఆలుగడ్డలను బాగా కడిగి తొక్కతో సహా ఉడకబెట్టి తింటే మేలు జరుగుతుంది. ఆలుగడ్డల్లో కార్టినాయిడ్స్, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.
ఆలుగడ్డలు కేవలం ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాదు, అందానికి కూడా పనిచేస్తాయి. ఆలుగడ్డలను గుజ్జుగా చేసి ముఖానికి ఫేస్ ప్యాక్‌లా ఉపయోగించవచ్చు. దాన్నే జుట్టుకు రాసి హెయిర్ ప్యాక్‌లా వాడవచ్చు. దీంతో చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఆలుగడ్డలను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి అనంతరం వాటిని తీసి చక్రాల్లా అడ్డంగా కట్ చేయాలి. ఆ ముక్కలను కళ్లపై 15 నిమిషాల పాటు పెట్టుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే కళ్ల కింద ఉండే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. ఆలుగడ్డల్లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. వీటిల్లో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆలుగడ్డలు ఆరోగ్యానికి ప్రయోజనకరమే అయినప్పటికీ వీటిని అధికంగా తినకూడదు. అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు వీటిని తినాలి.