Curd | చాలా మంది భోజనం చివర్లో పెరుగుతో తింటుంటారు. గడ్డ పెరుగు అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ప్యాకెట్ పాలతో తయారు చేసే పెరుగు కన్నా స్వచ్ఛమైన పాలతో తయారు చేసే పెరుగు ఎంతో రుచిగా ఉంటుంది. అందులో మీగడ ఎక్కువగా ఉండే కారణంగా పెరుగుకు ఎంతో టేస్ట్ వస్తుంది. అయితే చలికాలం అని చెప్పి చాలా మంది పెరుగును తినేందుకు వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఈ సీజన్లోనూ పెరుగును తినవచ్చు. మధ్యాహ్నం పూట పెరుగును తింటే కఫం చేరకుండా ఉంటుంది. కానీ రాత్రి పూట పెరుగును తినకూడదు. ఇక భోజనం చివర్లో పెరుగుతో తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగును తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పెరుగును రోజూ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగును ప్రో బయోటిక్ ఆహారంగా చెబుతారు. అందువల్ల దీన్ని తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ సమస్యలు ఉన్నవారు రోజూ పెరుగు తింటే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇది జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. భోజనం చివర్లో పెరుగుతో తింటే భోజనం చేసిన అనంతరం గ్యాస్ ఏర్పడకుండా చూసుకోవచ్చు. పెరుగును తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పెరుగుతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పెరుగును తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో రోగకారక క్రిములు నశిస్తాయి. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది.
పెరుగులో క్యాల్షియంతోపాటు ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి రెండూ దంతాలు, ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక పెరుగును రోజూ తినాలి. పెరుగును తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) పెరుగుతుంది. దీంతో శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అలాగే పెరుగును తినడం వల్ల శిరోజాలు, చర్మానికి కూడా ఎంతగానో మేలు జరుగుతుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సహజసిద్ధమైన ఎక్స్ఫోలియంట్గా పనిచేస్తుంది. దీంతో శిరోజాలు, చర్మం తేమగా ఉంటాయి. పొడిబారకుండా చూసుకోవచ్చు.
పెరుగులో అనేక రకాల ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ పెరుగును తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. పొడవుగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. రోజూ పెరుగును తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అధిక బరువును తగ్గించుకోవాలని అనుకునే ప్రణాళికలో ఉన్నవారు రోజూ పెరుగును తింటే ఎంతగానో ఫలితం ఉంటుంది. పెరుగును తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలా రోజూ పెరుగును భోజనం చివర్లో తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.