Weight Loss Mistakes | ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గేందుకు చాలా మంది రోజూ వ్యాయామం చేయడంతోపాటు డైట్‌ను కూడా పాటిస్తుంటారు. అయితే బరువు తగ్గే ప్రయత్నంలో చాలా మంది అనేక తప్పులు చేస్తుంటారు. దీంతో బరువు తగ్గే ప్రక్రియ ఆలస్యమవుతుంది. అనుకున్నంత త్వరగా బరువు తగ్గలేకపోతుంటారు. పలు రకాల తప్పులను చేయడం వల్ల కొందరు అసలు బరువు తగ్గరు. కానీ తప్పులు చేస్తున్నట్లు వారికి కూడా తెలియదు. తాము సరైన మార్గంలోనే ప్రయత్నం చేస్తున్నామని అనుకుంటారు. కానీ ఆశించినంత ఫలితం మాత్రం రావడం లేదని వాపోతుంటారు. ఇక బరువు తగ్గే ప్రయత్నంలో చాలా మంది చేసే తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు త్వరగా తగ్గాలని చెప్పి కొందరు డైటింగ్ పేరిట ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేస్తారు. లేదా గణనీయం ఆహారం తగ్గిస్తారు. కానీ ఇలా చేయడం సరికాదు. మన శరీరానికి రోజూ అవసరం అయిన కనీస శక్తి కోసం తప్పనిసరిగా కొంత మేర ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా మానేయడం లేదా అవసరం అయిన ఆహారం కన్నా కూడా పూర్తిగా తక్కువ ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇది శరీరంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. కనుక రోజూ పరిమిత మోతాదులో ఆహారం తీసుకున్నా అది మన శరీర కనీస అవసరాలకు సరిపోతుందా లేదా అన్న విషయాన్ని గమనించాలి. అందుకు అనుగుణంగానే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సరైన రీతిలో బరువు తగ్గుతారు. అలాగే కొందరు బరువు తగ్గాలని చెప్పి ఉదయం అల్పాహారం మానేస్తారు. కానీ అలా ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. ఉదయం అల్పాహారం మానేస్తే రోజులో మిగిలిన సమయంలో ఆహారం ఎక్కువగా తింటారని అధ్యయనాల్లో తేలింది. దీని వల్ల బరువు తగ్గరు సరికదా బరువు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ తప్పు కూడా చేయకూడదు.
బరువు తగ్గేందుకు చాలా మంది గంటల తరబడి వ్యాయామం లేదా జిమ్ చేస్తుంటారు. అలా చేయడం సరికాదు. దీని వల్ల శరీరంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. గుండెపై భారం పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ సంభవించి వెంటనే ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక రోజుకు 30 నిమిషాలకు మించకుండా వ్యాయామం చేస్తే చాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక వేళ మీరు ఫిట్ నెస్ ట్రెయినర్, డైటిషియన్, న్యూట్రిషియన్ వంటి వారి సలహాలను పాటిస్తుంటే వారి సూచనల మేరకు రోజూ నిర్దిష్టమైన సమయం పాటు జిమ్ లేదా వ్యాయామం చేయవచ్చు. ఇలా బరువు తగ్గడం తేలికవుతుంది. ఇక కొందరు బరువు తగ్గేందుకు గాను మార్కెట్లో లభించే అనేక రకాల హెర్బల్ ట్యాబ్లెట్లను వాడుతారు. అవి శరీరానికి ఏమాత్రం మంచివి కావు. వాటికి బదులుగా పండ్లు లేదా నట్స్, విత్తనాలు వంటివి తింటే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది.
బరువు తగ్గాలని చెప్పి కొందరు చక్కెర, నూనె పదార్థాలను పూర్తిగా మానేస్తారు. కానీ అలా మానేయాల్సిన పనిలేదు. వారంలో ఒకటి రెండు సార్లు ఆయా ఆహారాలను తినవచ్చు. కానీ అతిగా తినకూడదు. బరువు తగ్గడం కోసం చాలా మంది డైట్, వ్యాయామం పాటిస్తుంటారు. కానీ మద్యం సేవించడం, పొగ తాగడం వంటి అలవాట్లను మాత్రం మానలేకపోతుంటారు. కానీ ఇలా చేయడం సరికాదు. మీరు ఎంత డైట్ పాటించినా, వ్యాయామం చేసినా మద్యం సేవించడం, పొగ తాగడం అలవాట్లను మానకపోతే మీరు బరువు తగ్గలేరు. పైగా మీ ఆరోగ్యంపై ఆయా అలవాట్లు దుష్ప్రభావాలను చూపిస్తాయి. కనుక ఆయా అలవాట్లను మానేస్తేనే బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు షుగర్ ఫ్రీ పదార్థాలను ఉపయోగిస్తారు. వాస్తవానికి ఇవి కూడా మంచివి కావు. నిజంగా బరువు తగ్గాలని కోరుకుంటే షుగర్ ఫ్రీ పదార్థాలను కాకుండా పండ్లను తింటే మేలు జరుగుతుంది. ఇక బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు రోజూ తగినన్ని నీళ్లను తాగాల్సి ఉంటుంది. రాత్రి పూట తగినన్ని గంటలపాటు నిద్రపోవాలి. అప్పుడే బరువు త్వరగా తగ్గుతారు. కనుక ఈ పొరపాట్లను చేయకుండా సరైన రీతిలో డైట్‌ను పాటిస్తూ వ్యాయామం చేస్తుంటే సులభంగా బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉంటారు.