Prostate Cancer | ప్రోస్టేట్ క్యాన్సర్‌పై చాలామంది పురుషుల్లో అనేక అపోహాలు ఉన్నాయి. వ్యాధి గురించి వాస్తవాలను తెలుసుకోకుండా కేవలం అపోహలను నమ్మడం వల్ల క్యాన్సర్‌ను గుర్తించడంలో, చికిత్స ప్రారంభించడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఒకటి. భారత్‌లోనూ ఈ వ్యాధి కేసులు గణనీయంగా ఉన్నాయి. గ్లోబోకాన్ 2022 అంచనాల ప్రకారం దేశంలో 37,948 కొత్త ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించి వయసు, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన అంశాలు వంటి అనేక కారణాలు ప్రభావం చూపుతాయి. వయసు పెరిగే కొద్దీ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అయితే ఇది వృద్ధుల్లో మాత్రమే వచ్చే వ్యాధి అని భావించడం సరికాదు. కుటుంబంలో ప్రోస్టేట్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారిలో తక్కువ వయసులోనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రొమ్ము, అండాశయ క్యాన్సర్లకు సంబంధించిన కుటుంబ చరిత్ర కూడా కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన సంబంధం కారణంగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అందువల్ల కుటుంబంలో ఇలాంటి క్యాన్సర్ల చరిత్ర ఉన్న పురుషులు వైద్యులను సంప్రదించి తమ వ్యక్తిగత ప్రమాదాన్ని అంచనా వేయించుకోవడం మంచిది.
మరో సాధారణ అపోహ ఏమిటంటే.. ఎలాంటి లక్షణాలు లేవంటే ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా లేదని భావించడం. కానీ ఇది నిజం కాదు. ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు చాలాసార్లు సాధారణంగా కనిపించే ప్రోస్టేట్ గ్రంథి నిరపాయమైన వాపు లేదా పెరుగుదల లక్షణాలతో పోలి ఉంటాయి. మూత్రం ధార బలహీనంగా ఉండటం, మూత్ర విసర్జనలో ఇబ్బంది, తరచూ లేదా అత్యవసరంగా మూత్రం రావడం, కొన్నిసార్లు మూత్రంలో రక్తం కనిపించడం వంటి సమస్యలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం, మూత్రం ఆగిపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే వ్యాధి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టతరం చేసే అంశాల్లో ఒకటి. కాబట్టి శరీరంలో ఎలాంటి లక్షణాలు లేవని మాత్రమే ఆధారంగా చేసుకుని క్యాన్సర్ లేదని నిర్ధారించుకోవడం సరికాదు. వ్యక్తిగత ప్రమాద కారకాలను బట్టి వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అంటే ఇక చికిత్సకు అవకాశం లేదని భావించడం కూడా మరో అపోహ. ముఖ్యంగా వ్యాధిని ముందుగానే గుర్తిస్తే చికిత్స ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్సా విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. క్యాన్సర్ దశ, వ్యాధి రకం, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి రోబోటిక్ సర్జరీ, హార్మోన్ ఆధారిత చికిత్స, రేడియేషన్ థెరపీ వంటి వివిధ చికిత్సా విధానాలను వైద్యులు పరిగణిస్తారు.
పీఎస్ఏ స్థాయి పెరిగితే తప్పనిసరిగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లేనని భావించడం కూడా సరైంది కాదు. పీఎస్ఏ స్థాయి పెరగడం ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఒక సూచన అవుతుంది. అయితే క్యాన్సర్ కాకుండా ఇతర కారణాల వల్ల కూడా పీఎస్ఏ స్థాయిలు పెరుగుతాయి. ప్రోస్టేట్‌లో ఇన్ఫెక్షన్, మూత్రం నిలిచిపోవడం వంటి సమస్యలు కూడా పీఎస్ఏ పెరగడానికి కారణమవుతాయి. అందువల్ల పీఎస్ఏ స్థాయి ఎక్కువగా ఉందని తేలిన వెంటనే క్యాన్సర్ అని నిర్ణయించకుండా, అవసరమైన అదనపు పరీక్షలు నిర్వహించిన తర్వాతే నిర్ధారణకు రావాలి. చికిత్స తీసుకున్న తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ మళ్లీ వస్తే ఇక ఏమీ చేయలేమని భావించడం కూడా మరో అపోహ. క్యాన్సర్ తిరిగి వచ్చినా చికిత్సకు అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు కాదు. క్యాన్సర్ ఎక్కడ తిరిగి వచ్చింది, గతంలో ఎలాంటి చికిత్స తీసుకున్నారు, ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలను బట్టి తదుపరి చికిత్సా విధానాన్ని నిర్ణయించవచ్చు.
పునరావృతమైన క్యాన్సర్‌కు కూడా పరిస్థితిని బట్టి వివిధ చికిత్సా మార్గాలు అందుబాటులో ఉంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో అపోహలు, నిర్లక్ష్యం రెండూ హానికరంగా మారే అవకాశం ఉంటుంది. వ్యాధి ప్రమాద కారకాలను అర్థం చేసుకోవడం, అవసరమైన సమయంలో వైద్యులను సంప్రదించడం, లక్షణాలు లేకపోయినా వ్యక్తిగత ప్రమాదాన్ని బట్టి పరీక్షల అవసరాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలను అపోహల ఆధారంగా కాకుండా సరైన వైద్య సలహా, వాస్తవ సమాచారంపై తీసుకోవడం ద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.