Summer | తీవ్రమైన సూర్యతాపం కారణంగా ఎండకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సెలవుల ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. డీహైడ్రేషన్ మొదలుకుని ఫుడ్ పాయిజనింగ్ వరకు వేసవిలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎండకాలంలో వచ్చే చిక్కులను, వాటి నివారణ గురించి తెలుసుకుందాం.
ఎండకాలంలో చెమట ఎక్కువగా పడుతుంది. ఈ కారణంగా శరీరం నీళ్లు, మినరల్స్‌ను కోల్పోతుంది. ఇలాంటప్పుడు తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ తలెత్తుతుంది. దీంతో తలతిప్పడం, తలనొప్పి, అలసట, చర్మం పొడిబారడం లాంటివి బాధిస్తాయి. కాబట్టి, దాహంగా అనిపించనప్పటికీ రోజంతా వీలైనన్ని సార్లు నీళ్లు తాగుతూ ఉండాలి. పుచ్చకాయ, కీరదోస, నారింజ లాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. కెఫీన్, ఆల్కహాల్ మోతాదుకు మించి తీసుకోకూడదు. ఇవి డీహైడ్రేషన్ సమస్యను తీవ్రం చేస్తాయి. ఎండలో బయటికి వెళ్లేటప్పుడు ఓ నీళ్ల బాటిల్ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి.
ఎండలో ఎక్కువసేపు ఉంటే చర్మం కందిపోవడం, దద్దుర్లు, చెమటకాయలు సహా ఎన్నో చర్మ సమస్యలు వస్తాయి. అందువల్ల బయటికి వెళ్లేటప్పుడు చర్మానికి ఎస్పీఎఫ్ 30, అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ అప్లయ్ చేసుకోవాలి. తేలికైన, గాలి ధారాళంగా వచ్చే కాటన్ దుస్తులు ధరించాలి. దీంతో చెమట అంతగా పట్టదు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. చర్మం కమిలినప్పుడు చికిత్స కోసం అలోవెరా జెల్ కానీ, ఏదైనా కూలింగ్ మాయిశ్చరైజర్ కానీ వాడాలి.
డీహైడ్రేషన్, అధిక చెమట మూత్రం పరిమాణాన్ని తగ్గిస్తాయి. ఇది మూత్రనాళంలో బ్యాక్టీరియా ముప్పును పెంచుతుంది. దీంతో మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. స్త్రీలు మరీ జాగ్రత్తగా ఉండాలి. శరీరం నుంచి టాక్సిన్లు బయటికి వెళ్లడానికి నీళ్లు, ఫ్లూయిడ్లు తాగుతూ ఉండాలి. పబ్లిక్ టాయిలెట్ ఉపయోగిస్తే ఆ తర్వాత శరీర పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మూత్రాన్ని ఎక్కువసేపు ఉగ్గబట్టుకోకూడదు. బ్యాక్టీరియా నివారణ కోసం వదులుగా ఉండే కాటన్ అండర్‌వేర్‌ను ధరించడం మంచిది.
ఎండలో ఎక్కువసేపు గడిపితే తలతిప్పడం, వికారం, అధిక చెమట లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో చాలామంది వడదెబ్బకు గురవుతారు. ఈ పరిస్థితి రాకుండా ఎండ బాగా ఉండే మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య బయటికి వెళ్లకూడదు. ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉండే కొబ్బరినీళ్ల లాంటి ఫ్లూయిడ్స్ తీసుకోవాలి.