Herbal Tea For Hair Growth | ప్రస్తుత తరుణంలో కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలిపోతూ చాలా మంది పురుషులకు బట్టతల కూడా వస్తోంది. అయితే స్త్రీలు లేదా పురుషులు ఎవరిలో అయినా సరే జుట్టు రాలేందుకు అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కాలుష్యం, నీళ్లు, ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం.. వంటి కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలుతోంది. ఇక స్త్రీలలో అయితే హార్మోన్ల సమస్య కారణంగా చాలా వరకు జుట్టు రాలుతుంది. దీంతోపాటు థైరాయిడ్ కూడా జుట్టు రాలేందుకు కారణం అవుతుంది. అయితే ఒక హెర్బల్ టీని తయారు చేసి రోజూ సేవించడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు.
మెంతులు, దాల్చిన చెక్కలను గ్రీన్ టీలో వేసి టీ తయారు చేసి తాగుతుండాలి. మెంతుల్లో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో శరీరం గ్లూకోజ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీని వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఇక దాల్చిన చెక్కలో సినామాల్డిహైడ్, కెయ్లాన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కూడా శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది జుట్టు రాలేందుకు సహాయం చేస్తుంది. అదేవిధంగా గ్రీన్ టీలో కాటెకిన్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని అధికం చేస్తాయి. దీంతో శరీరం గ్లూకోజ్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. గ్లూకోజ్ మెటబాలిజం పెరుగుతుంది. దీని వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక ఈ టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులను రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను నీటితో సహా అలాగే మరిగించాలి. అందులో కాస్త దాల్చిన చెక్కను వేయాలి. నీరు సగం అయ్యే వరకు మరిగించాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని వడకట్టాలి. అనంతరం అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా మెంతులు, దాల్చిన చెక్క వేసి తయారు చేసిన గ్రీన్ టీని రోజూ సేవిస్తుండాలి. దీంతో హార్మోన్ సమస్యలు తగ్గుతాయి. ఫలితంగా జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. జుట్టు వేగంగా పెరుగుతుంది. పొడవుగా, ఒత్తుగా మారుతుంది.
ఇక ఇలా తయారు చేసిన టీని సేవించడం వల్ల పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ టీని సేవిస్తే కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా ఈ టీతో అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు.