Magnesium Rich Foods | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు అనేక పోషకాలు అవసరం అవుతుంటాయి. పోషకాలు అన్నీ సరిగ్గా లభిస్తేనే మనకు వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండగలం. ఇక మన శరీరానికి అవసరమైన పోషకాల్లో మెగ్నిషియం ఒకటి. ఇది మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కండరాల పనితీరుకు, నాడీ మండల వ్యవస్థకు, గుండె ఆరోగ్యంగా కొట్టుకునేందుకు, ఎముకలు దృఢంగా ఉండేందుకు మెగ్నిషియం ఎంతగానో దోహదపడుతుంది. పెద్దలకు మెగ్నిషియం రోజుకు 350 మిల్లీ గ్రాముల నుంచి 400 మిల్లీగ్రాముల మేర అవసరం అవుతుంది. ఈ క్రమంలోనే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మెగ్నిషియం ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పలు రకాల కూరగాయలను తినడం వల్ల మనం మెగ్నిషియంను సులభంగా పొందవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
పాలకూర మనకు ఏ సీజన్లో అయినా లభిస్తుంది. అయితే ఇందులో పోషకాలు అనేకం ఉంటాయి. వాటిల్లో మెగ్నిషియం కూడా ఒకటి. మెగ్నిషియం అధికంగా ఉండే ఆహారాల్లో పాలకూర కూడా ఒకటి. 100 గ్రాముల ఉడకబెట్టిన పాలకూరను తినడం వల్ల మనకు సుమారుగా 87 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. అలాగే మెంతులను కూడా మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. 100 గ్రాముల మెంతులను తింటే సుమారుగా 51 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. అదేవిధంగా మునగాకులోనూ మెగ్నిషియం అధికంగా ఉంటుంది. మునగాకును పోషకాలకు గనిగా చెప్పవచ్చు. 100 గ్రాముల ఉడకబెట్టిన మునగాకును తింటే సుమారుగా 45 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. ఇది మనల్ని అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆవాలను కూడా మనం వంటల్లో ఉపయోగిస్తుంటాం. వీటిని పోపు దినుసులుగా వాడుతుంటారు. అయితే ఆవాలను ఆహారంలో భాగం చేసుకుంటే 100 గ్రాములకు మనకు సుమారుగా 32 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. అలాగే కాకరకాయల్లోనూ మెగ్నిషియం సమృద్ధిగానే ఉంటుంది. కాకరకాయలతో మనం తరచూ అనేక వంటకాలను చేస్తుంటాం. 100 గ్రాముల మేర కాకరకాయలను తింటే సుమారుగా 17 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. ఇక బెండకాయలు అంటే కూడా చాలా మందికి ఇష్టమే. వీటితో కూర, వేపుడు, పులుసు వంటివి చేస్తుంటారు. బెండకాయలు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే వీటిల్లో మెగ్నిషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. 100 గ్రాముల మేర బెండకాయలను తినడం వల్ల మనకు సుమారుగా 57 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది.
పచ్చి బఠానీలను ఎంతో ఆరోగ్యకరంగా చెప్పవచ్చు. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. చికెన్, మటన్ వంటి మాంసాహారం తినలేని వారికి పచ్చి బఠానీలు ప్రోటీన్లను అందిస్తాయి. పచ్చి బఠానీలను మనం తరచూ అనేక వంటల్లో వేస్తుంటాం. అయితే 100 గ్రాముల పచ్చి బఠానీలను తింటే సుమారుగా 33 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. అలాగే స్వీట్ కార్న్లోనూ మెగ్నిషియం సమృద్ధిగానే ఉంటుంది. 100 గ్రాముల మేర స్వీట్ కార్న్‌ను తింటే సుమారుగా 27 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. అదేవిధంగా ఆలుగడ్డలను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా మెగ్నిషియం పొందవచ్చు. 100 గ్రాముల మేర ఆలుగడ్డలను తింటే సుమారుగా 48 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. ఇలా పలు ఆహారాలను తింటుంటే మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తుంది. దీంతో కండరాలు, నాడులు ఆరోగ్యంగా ఉంటాయి.