Low Immunity Symptoms | మన శరీరంలో ఎప్పటికప్పుడు చేరే క్రిములతోపాటు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లను నిర్మూలించేందుకు మన శరీర రోగ నిరోధక వ్యవస్థ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే మనం క్రిముల నుంచి సురక్షింగా ఉండవచ్చు. రోగాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. అయితే ప్రస్తుతం చాలా మంది పాటిస్తున్న అనారోగ్యకరమైన జీవన శైలితోపాటు పలు ఇతర కారణాల వల్ల చాలా మందికి రోగ నిరోధక శక్తి తక్కుగా ఉంటోంది. కరోనా సమయంలోనూ రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారే ప్రాణాలతో బయట పడ్డారు. ఆ శక్తి తక్కువగా ఉన్నవారు ప్రాణాలను కోల్పోయారు. కనుక ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు కూడా రోగ నిరోధక శక్తి కీలకపాత్ర పోషిస్తుంది. రోగాలు అనేవి చెప్పి రావు కనుక అవి వచ్చే ముందే మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. అందుకు గాను రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా దగ్గు, జలుబు ఎల్లప్పుడూ ఉంటాయి. ముక్కు దిబ్బడతోపాటు జ్వరం కూడా వస్తుంటుంది. ఇన్ఫెక్షన్లు ఒక పట్టాన తగ్గవు. ఈ లక్షణాలు కనిపిస్తుంటే మీ శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చిన వారు మందులను వాడుతున్నా కూడా అంత త్వరగా తగ్గదు. అంటే దానర్థం.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలుసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే ఎన్ని మందులను వాడినా ప్రయోజనం ఉండదు. ఇన్ఫెక్షన్ లేదా రోగం అంత త్వరగా తగ్గదు. ఇమ్యూనిటీ తక్కువగా ఉందని తెలిపేందుకు ఇది కూడా ఒక సంకేతంగా భావించాలి.
ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో తరచూ చెవి ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కొందరికి న్యుమోనియా, తీవ్రమైన సైనస్ సమస్య ఉంటాయి. అలాగే యాంటీ బయోటిక్స్‌ను వాడుతున్నప్పటికీ ఆయా సమస్యల నుంచి త్వరగా కోలుకోలేకపోతుంటారు. ఇలాంటి లక్షణాలన్నీ తక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉందని తెలియజేసే సంకేతాలు. ఇవి కనిపించినా కూడా జాగ్రత్త పడాల్సిందే. అలాగే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. సరిగ్గా నిద్రపోయినా, ఆహారం సరిగ్గా తీసుకున్నా కూడా కొందరికి ఎల్లప్పుడూ నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. ఈ లక్షణండా తక్కువ ఇమ్యూనిటీ పవర్‌ను సూచిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే శరీరంలో శక్తి స్థాయిలు నిరంతరం తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన తరువాత కూడా బద్దకంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేయలేరు. శరీరంలో శక్తి లేనట్లు ఫీలవుతారు. ఇలా జరుగుతున్నా కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి.
డయాబెటిస్ ఉన్నవారిలోనే కాదు.. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారిలోనూ గాయాలు, పుండ్లు నెమ్మదిగా మానుతాయి. లేదా అసలు మానవు. ఈ సమస్య ఉన్నా ఇమ్యూనిటీ తగ్గిందని అర్థం చేసుకోవాలి. డయాబెటిస్ లేనట్లయితే కచ్చితంగా రోగ నిరోధక శక్తి తగ్గిందని భావించాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వారిలో తరచూ జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా కొందరిలో తరచూ విరేచనాలు అవుతాయి. లేదా కొందరిలో ఎల్లప్పుడూ మలబద్దకం సమస్య ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలు నిరంతరం ఉంటాయి. అదేవిధంగా జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. దీని కారణంగా తరచూ పుల్లని త్రేన్పులు వస్తుంటాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే తరచూ చర్మ సమస్యలు కూడా వస్తాయి. చర్మంపై ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఒక పట్టాన తగ్గవు. ఇవన్నీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందని తెలియజేసే సంకేతాలు. ఈ సంకేతాలు కనిపిస్తుంటే ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో ఆయా సమస్యలు ఆటోమేటిగ్గా తగ్గిపోతాయి.