Low Birth Weight | తల్లిగర్భంలోనే ప్రారంభమయ్యే ఆరోగ్య ప్రభావాలు జీవితాంతం కొనసాగుతాయని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పుట్టినప్పుడు బరువు తక్కువగా ఉన్నవారికి పెద్దయ్యాక స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇప్పటి వరకు పెద్దల బరువు, జీవనశైలి వంటి అంశాలకే ప్రాధాన్యం ఇచ్చిన వైద్యులు, ఇకపై జనన సమయంలో బరువును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్వీడన్లోని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరిశోధనలో దాదాపు 8 లక్షల మంది డేటాను విశ్లేషించారు. ఈ అధ్యయనం ప్రకారం, సగటు 3.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టినవారికి మొత్తం స్ట్రోక్ ప్రమాదం సుమారు 21 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో రక్తనాళం బ్లాక్ అయ్యే ఇస్కీమిక్ స్ట్రోక్తో పాటు, మెదడులో రక్తస్రావం జరిగే హేమరేజిక్ స్ట్రోక్లు కూడా ఉన్నాయి.
లింగ ఆధారంగా చూసినా ఈ ప్రమాదం స్పష్టంగా కనిపించింది. తక్కువ బరువుతో పుట్టిన మహిళల్లో స్ట్రోక్ ప్రమాదం 18 శాతం పెరిగితే, పురుషుల్లో ఇది 23 శాతం వరకు పెరిగినట్లు అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా ఈ ప్రభావం వ్యక్తి పెద్దయ్యాక బరువు ఎలా ఉన్నా కొనసాగుతుండటం గమనార్హం. అంటే తరువాత సాధారణ బరువులో ఉన్నా, చిన్నప్పటి తక్కువ జనన బరువు ప్రభావం పూర్తిగా తగ్గిపోదని అర్థం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం తక్కువ బరువుతో పుట్టడం అనేది గర్భంలో ఎదుగుదల సరిగా జరగలేదని సూచిస్తుంది. ఇది గుండె, రక్తనాళాలు, మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపి, భవిష్యత్తులో రక్తపోటు నియంత్రణలో మార్పులు లేదా రక్తనాళ నిర్మాణంలో లోపాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లే స్ట్రోక్ ప్రమాదం పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు స్ట్రోక్ ప్రమాదాన్ని అంచనా వేయడంలో రక్తపోటు, కొలెస్ట్రాల్, ధూమపానం, డయాబెటిస్ వంటి అంశాలపై దృష్టి సారించేవారు. కానీ ఈ కొత్త పరిశోధనతో, జనన బరువు కూడా ఒక ముఖ్య సూచికగా మారే అవకాశముంది. తక్కువ బరువుతో పుట్టినవారిని వైద్యులు మరింత జాగ్రత్తగా పరిశీలించి, ముందస్తు జాగ్రత్తలు సూచిస్తారు. అయితే తక్కువ బరువుతో పుట్టిన ప్రతి ఒక్కరికీ స్ట్రోక్ వస్తుందనేది తప్పు. అలాగే, పెద్దయ్యాక అధిక బరువు లేదా చెడు జీవనశైలి ప్రభావం ఉండదని కూడా కాదు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామం, ధూమపానం నివారణ, రక్తపోటు నియంత్రణ వంటి మంచి అలవాట్లు పాటించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యం అనేది గర్భస్థ దశ నుంచే ప్రారంభమయ్యే ప్రయాణమని ఈ అధ్యయనం మరోసారి స్పష్టం చేస్తోంది.