మనిషి జీవన గమనానికి నీరు అమృతం లాంటిది. జీర్ణక్రియ, ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ, కిడ్నీల ఆరోగ్యం ఇలా వివిధ శరీర విధుల్లో నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇక రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు అవసరమని అందరూ సలహా ఇస్తుంటారు. ఇలాంటప్పుడు అసలు రోజుకు ఎన్ని నీళ్లు తాగితే శరీరం నుంచి వ్యర్థాలు తొలగిపోతాయో తెలుసుకుని ఉండాలి. మరీ ముఖ్యంగా కిడ్నీలకు ఎన్ని నీళ్లు అవసరమవుతాయనేది ప్రధానమైన అంశం. కాబట్టి, కిడ్నీలు – నీళ్లకు సంబంధించిన నిజాలను గురించి తెలుసుకుందాం.
శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతూకంలో ఉండటానికి, రక్తంలో వ్యర్థాలను వడపోయడానికి తగిన ప్రమాణంలో నీళ్లు కిడ్నీలకు అవసరమవుతాయి. చాలామందికి దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలనేది సాధారణమైన హెచ్చరిక. కిడ్నీ వ్యాధులు, డయాబెటిస్, ఇతర వైద్య పరిస్థితులు ఉన్నవాళ్లు వాళ్ల శరీరానికి ఎంత హైడ్రేషన్ అవసరం అనేది వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి.
నిజం: సుమారు పావు లీటరు నీళ్లు చొప్పున రోజుకు ఎనిమిది గ్లాసులు తీసుకోవాలనేది సాధారణంగా చేసే సూచన. అలాగని దీనికి శాస్త్రీయమైన ప్రాతిపదిక ఏమీ లేదు. మనం ఎన్ని నీళ్లు తాగాలి అనేది… వయసు, శరీర బరువు, వాతావరణం, పనిచేసే స్థాయి, మన ఆరోగ్యం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. నేషనల్ అకాడమిక్స్ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్, అండ్ మెడిసిన్ (నాసెమ్) ప్రకారం రోజుకు అన్ని రకాల ఆహార, పానీయ వనరుల నుంచి పురుషులైతే 3.7 లీటర్లు, స్త్రీలైతే 2.7 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి.
నిజం: కిడ్నీలు సాఫీగా పనిచేయాలంటే తగినంత హైడ్రేషన్ తప్పనిసరి. అలాగని నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుందని మాత్రం కాదు. పైగా మోతాదుకు మించి నీళ్లు తాగితే రక్తంలో సోడియం స్థాయులు తగ్గే హైపోనైట్రేమియా అనే పరిస్థితి తలెత్తుతుంది. సోడియం నిల్వలు పడిపోవడంతో అయోమయం, మూర్చ లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి కోమాలోకీ వెళ్లిపోవచ్చు. కాబట్టి, ఆరోగ్యవంతులు దాహంగా అనిపించినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి.
నిజం: నీళ్లు ఎక్కువగా తాగకుండానే కిడ్నీలు రక్తంలోని మలినాలను (టాక్సిన్లు) వడపోసి తొలగిస్తాయి. తగినన్ని నీళ్లు తాగితే కిడ్నీలు సాఫీగా పనిచేయడానికి అండగా ఉంటాయి. అయితే, నీళ్లు ఎక్కువగా తాగితే టాక్సిన్లు తొలగిపోవడం పెరిగిపోదు. బదులుగా సమతుల ఆహారం తీసుకుంటూ, ఎక్కువ ఉప్పు, మోతాదు మించిన చక్కెర, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలను పరిమితికి మించి తీసుకోకపోతే కిడ్నీలు ఆరోగ్యకరంగా పనిచేస్తాయి.
నిజం: మూత్రం రంగు హైడ్రేషన్ స్థాయులను సూచించినప్పటికీ, కేవలం ఇదొక్కటే ప్రధానమైన అంశం మాత్రం కాదు. కొన్ని రకాల ఆహారాలు, మందులు, వైద్య పరిస్థితులు కూడా మూత్రం రంగును నిర్ధారిస్తాయి. సాధారణంగా లేత పసుపు రంగు మూత్రం మంచి హైడ్రేషన్‌ను సూచిస్తుంది. అప్పుడప్పుడు గాఢమైన పసుపు రంగులో మూత్ర విసర్జన అన్నివేళలా డీహైడ్రేషన్‌కు సూచిక కాకపోవచ్చు.