Lemon Peels | నిమ్మకాయలను మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. నిమ్మరసం మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే నిమ్మకాయలను వాడిన తరువాత వాటి తొక్కలను పడేస్తాం. కానీ వాస్తవానికి నిమ్మతొక్కల్లోనూ అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా నిమ్మ తొక్కల్లో విటమిన్ సి ఉంటుంది. అలాగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. నిమ్మతొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. నిమ్మతొక్కలను ఏవిధంగా తీసుకుంటే లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మతొక్కలను మీరు బేకరీ పదార్థాల్లో వేయవచ్చు. నిమ్మతొక్కను తురుం పట్టి వేస్తే ఆ ఫుడ్ ఐటమ్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే సిట్రస్ ఫ్లేవర్‌తో తాజాగా అనిపిస్తాయి. నిమ్మతొక్క కింది భాగంలో ఉండే తెలుపు రంగు పదార్థాన్ని తురిమి వేయాల్సి ఉంటుంది. దీంతో ఆహారాలకు చక్కని వాసన వస్తుంది. చక్కని రుచిని కూడా కలిగి ఉంటాయి. మార్కెట్లో మనకు లెమన్ ఇన్ఫ్యూస్డ్ ఆయిల్స్ లభిస్తాయి. వీటిని తొక్కతోనే తయారు చేస్తారు. వీటిని సలాడ్స్, పాస్తా, కూరగాయలు, చేపల్లో వేసుకోవచ్చు. ఇవి రుచిని పెంచుతాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నిమ్మతొక్కలతో క్యాండీలను తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. చక్కెర పాకంలో ముంచి తీసి తయారు చేయాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసిన నిమ్మతొక్కలను అందరూ ఇష్టంగా తింటారు. లేదా నిమ్మతొక్కలను కేక్స్, టార్ట్స్, ఐస్‌క్రీమ్ వంటి వాటికి గార్నిష్ కోసం కూడా వాడుకోవచ్చు. నిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి టీ కూడా తయారు చేయవచ్చు. ఇలా తయారు చేసిన టీని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అరుచి తగ్గుతుంది. ఇందులో కాస్త అల్లం రసం, పుదీనా ఆకులను వేసి తాగితే ఇంకా మంచిది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి బయట పడవచ్చు.
మీరు తయారు చేసుకునే సూప్‌లలో కూడా నిమ్మతొక్కలను వేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. సూప్‌లలో నిమ్మతొక్కలను వేయడం వల్ల రుచి పెరగడమే కాకుండా ఆ సూప్ జీర్ణశక్తిని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా ఇలా చలికాలంలో తాగడం మేలు చేస్తుంది. నిమ్మతొక్కలను మీరు ఆహారాల్లో ఏ విధంగా అయినా సరే తీసుకోవచ్చు. కానీ నిమ్మకాయలను వాడిన తరువాత తొక్కలను మాత్రం పడేయకండి. నిమ్మతొక్కల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది, దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
నిమ్మతొక్కల్లో హెస్పెరిడిన్, డి-లిమోనీన్ అనే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు రావు. నిమ్మతొక్కల్లో ఉండే పెక్టిన్ ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఇలా నిమ్మతొక్కల వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.