Lemon Juice | చలికాలంలో మనకు సీజనల్ వ్యాధులు అనేకం వస్తుంటాయి. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ ఈ సీజన్లో మనల్ని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. కాస్తంత చల్లని నీళ్లను తాగినా చాలు వెంటనే ముక్కు దిబ్బడ వచ్చేస్తుంది. అలాగే దగ్గు కూడా వస్తుంది. ఈ సీజన్లో మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. దీనికి తోడు ఎండ తక్కువ ఉంటుంది కనుక మనకు విటమిన్ డి కూడా చాలా తక్కువగా లభిస్తుంది. అయితే ఈ సీజన్లో వచ్చే అన్ని సమస్యలకు చెక్ పెడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు నిమ్మరసం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. చలికాలంలో ఈ విధంగా కచ్చితంగా తాగాలని వారు సూచిస్తున్నారు.
మన శరీరంలో లివర్ అనేక కీలక విధులను నిర్వహిస్తుంది. లివర్ సుమారుగా 800 పైగా జీవక్రియలను నిర్వహిస్తుంది. అయితే చలికాలంలో లివర్ పనితీరు మందగిస్తుంది. దీంతో వ్యర్థాలు, కొవ్వు పేరుకుపోతాయి. దీంతో లివర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక లివర్‌ను ఎప్పటి కప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇందుకు గాను నిమ్మరసం ఎంతగానో పనిచేస్తుంది. నిమ్మరసం తాగడం వల్ల లివర్‌లో పేరుకుపోయిన వ్యర్థాలు కరిగిపోతాయి. విష పదార్థాలు బయటకు వస్తాయి. దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ వ్యాధులు ఉన్నవారు కూడా రోజూ నిమ్మరసాన్ని సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. లివర్ మళ్లీ ఎప్పటిలా చురుగ్గా పనిచేస్తుంది. ఇక ఈ సీజన్లో మన చర్మం బాగా పగులుతుంది. పొడిగా మారి దురద పెడుతుంది. కానీ నిమ్మరసం తాగుతుంటే విటమిన్ సి లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాంతివంతంగా మారుతుంది. చర్మానికి తేమ, మృదుత్వం లభిస్తాయి. దీంతో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కనుక నిమ్మరసాన్ని తాగుతుండాలి.
నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుక దీన్ని రోజూ తాగుతుంటే మన శరీర ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ సీజన్లో మన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది కనుక నిమ్మరసం తాగితే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. దీంతో ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఫ్లూ జ్వరం కూడా తగ్గుతుంది. గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది. చలికాలంలో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. రోజూ సుఖ విరేచనం అవక నానా అవస్థలు పడుతుంటారు. అలాంటి వారు రోజూ ఉదయాన్నే పరగడుపునే నిమ్మరసం సేవిస్తుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. నిమ్మరసం తాగడం వల్ల సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారి మెరుగ్గా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్తి, గ్యాస్, అసిడిటీ ఉండవు.
నిమ్మరసాన్ని సేవించడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చలికాలంలో చాలా మందికి బద్దకం వస్తుంది. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవలేకపోతుంటారు. అలాంటి వారు నిమ్మరసం తాగితే యాక్టివ్‌గా ఉంటారు. బద్దకం పోతుంది. మైండ్ రిలాక్స్ అయి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. యాక్టివ్‌గా, చురుగ్గా ఉంటారు. రోజంతా శక్తివంతంగా అనిపిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎంత పనిచేసినా త్వరగా అలసిపోరు. నిమ్మరసాన్ని సేవిండం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్లే ఇది సాధ్యమవుతుంది. కనుక ఈ సీజన్లో నిమ్మరసాన్ని సేవించడం మరిచిపోకండి.