Lemon And Turmeric | పసుపు, నిమ్మకాయ.. ఇవి మన వంటింట్లో ఉండే పదార్థాలే. తరచూ మనం వీటిని పలు రకాలుగా ఉపయోగిస్తుంటాం. పసుపును నిత్యం వంటల్లో వేస్తుంటారు. నిమ్మరసాన్ని చాలా వరకు ఆహారాల తయారీతోపాటు పానీయాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. వేసవి కాలంలో సహజంగానే నిమ్మరసాన్ని ఎక్కువగా సేవిస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం ఈ రెండు పదార్థాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని కలిపి తీసుకుంటేనే అధిక ప్రయోజనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పసుపు, నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభించడంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని, ఈ మిశ్రమంతో పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.
పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అందువల్ల వాపులను సైతం ఇది తగ్గిస్తుంది. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే వాపులను మరింత సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. దీంతోపాటు నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ లేదా గౌట్ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ రెండింటి మిశ్రమం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆయా సమస్యల నుంచి బయట పడేందుకు సహాయం చేస్తుంది. పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తీసుకుంటే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా రక్షించుకోవచ్చు. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
పసుపు, నిమ్మరసం మిశ్రమం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు వెళ్లేలా చేస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు. లివర్‌లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఈ మిశ్రమం రోగ నిరోధక వ్వవస్థను మరింత దృఢంగా మారుస్తుంది. దీంతో శరీరం వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తీసుకుంటే మ్యాజిక్ బుల్లెట్లా పనిచేస్తుంది. ఇది మెటబాలిజంను పెంచుతుంది. క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరిగేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిశ్రమం ఔషధంలా పనిచేస్తుంది.
పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి కూడా ఈ మిశ్రమం ఎంతో మేలు చేస్తుంది. పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని మన శరీరంపై బాహ్యంగా కూడా ప్రయోగించవచ్చు. దీన్ని ఫేస్ ప్యాక్ గా కూడా వాడవచ్చు. ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి. ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని రాస్తుంటే చర్మ సమస్యలు సైతం తగ్గిపోతాయి. గజ్జి, తామర, దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక పసుపు, నిమ్మరసం మిశ్రమాన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే అందులో కాస్త తేనె కలిపి తాగవచ్చు. ఇలా ఈ మిశ్రమం మనకు అద్భుతాలను అందిస్తుంది.