Kodo Millets | ఆరోగ్యంగా ఉండేందుకు ప్రస్తుతం చాలా మంది మిల్లెట్స్‌ను తింటున్నారు. వీటినే చిరు ధాన్యాలు లేదా సిరి ధాన్యాలు అని కూడా పిలుస్తారు. చిరు ధాన్యాలు అనగానే చాలా మంది రాగులు, జొన్నలు, సజ్జలు అని గుర్తుంచుకుంటారు. కానీ వీటిల్లో ఇంకా అనేక రకాలు ఉన్నాయి. అవి కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇక చిరు ధాన్యాల్లో ఒకటైన అరికెలను కూడా మనం తినవచ్చు. వీటినే కోడో మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. పూర్వం ప్రజలు అరికెలను కూడా ఎక్కువగానే తినేవారు. వీటితో జావ, ఉప్మా, అన్నం వంటివి వండి తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అనేక పోషకాలను మనకు అందిస్తాయి. ఈ క్రమంలోనే అరికెలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అరికెలను తినడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అరికెలు ప్రీబయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. అంటే వీటిని తింటుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. షుగర్ ఉన్నవారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. అరికెల గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ తక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. ఇది షుగర్ ఉన్నవారికి ఉపయోగపడే విషయం. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది.
అరికెలను తింటుంటే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. వీటిల్లో పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అరికెలలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి వల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మోకాళ్ల నొప్పులను సైతం తగ్గించుకోవచ్చు. అలాగే ఔట్ ఉన్నవారు ఉపశమనం పొందవచ్చు.
అరికెలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. వీటిని తింటే మెగ్నిషియం అధికంగా లభిస్తుంది. ఇది కండరాలను ప్రశాంతంగా మారుస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. రక్త సరఫరా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అరికెలలో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. దీని వల్ల హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా అరికెలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.