Kidneys Damage Symptoms | మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు వడబోసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయన్న విషయం తెలిసిందే. కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. అందులో ఉండే మలినాలను బయటకు పంపిస్తాయి. అయితే మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పలు ఇతర కారణాల వల్ల కిడ్నీల పనితీరు మందగిస్తుంది. దీంతో అనేక కిడ్నీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కొందరిలో కిడ్నీలు డ్యామేజ్ అవకాశాలు ఉంటాయి. కిడ్నీలు డ్యామేజ్ అయితే కొందరిలో లక్షణాలు ఏమీ కనిపించవు. కానీ చాలా వరకు వ్యక్తులలో లక్షణాలను ముందుగానే పసిగట్టవచ్చు. ఆ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే తగిన సమయంలో చికిత్స తీసుకుని కిడ్నీలను రక్షించుకోవచ్చు. దీంతో కిడ్నీలకు కలిగే ప్రమాదం తప్పుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు లేదా డ్యామేజ్ అవుతున్న సమయంలో మూత్రంలో పలు మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. రాత్రి పూట ఈ అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. మీకు షుగర్ లేకపోయినా తరచూ మూత్రం వస్తుందంటే మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయన్న విషయాన్ని గమనించాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. మూత్రంలో నురుగు వస్తున్నా కూడా కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని అర్థం చేసుకోవాలి. మూత్రంలో ప్రోటీన్ ఉంటే ఇలా నురుగు కనిపిస్తుంది. వాస్తవానికి ఇది ప్రమాదకరమైన పరిస్థితి. అలాగే కొందరికి మూత్రంలో రక్తం పడుతుంది. దీన్నే హెమటురియా అంటారు. ఇది కూడా ఒక ప్రమాదకరమైన స్థితే అని భావించారు. కొందరికి మూత్రం టీ కలర్లో లేదా లేత గోధుమ రంగులో వస్తుంది. మూత్రం ఈ రంగులో వస్తున్నా కూడా అనుమానించాల్సి ఉంటుంది.
కిడ్నీలు డ్యామేజ్ అయిన వారిలో శరీరంలో ద్రవాలు ఎక్కువగా పేరుకుపోతాయి. దీంతో వారి పాదాలు, చేతులు, మడమలు, కాళ్ల భాగాలు వాపులకు గురవుతాయి. కొందరికి ముఖం కూడా ఉబ్బిపోయి కనిపిస్తుంది. కళ్ల కింద కూడా వాపులు కనిపిస్తాయి. కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పేందుకు ఇవి ప్రధానమైన సంకేతాలుగా భావించాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నవారిలో erythropoietin (EPO) అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఎర్ర రక్త కణాల ద్వారా శరీరానికి ఆక్సిజన్ అందేలా చూస్తుంది. అయితే కిడ్నీలు డ్యామేజ్ అయితే erythropoietin (EPO) సరిగ్గా ఉత్పత్తి కాదు. దీని వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీని వల్ల కణాలకు ఆక్సిజన్ లభించక నీరసం, అలసట ఉంటాయి. చిన్న పనిచేసినా విపరీతంగా అలసిపోతారు. అలాగే వాతావరణం వెచ్చగా ఉన్నప్పటికీ చేతులు, పాదాలు మాత్రం చల్లగా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటిని కూడా కిడ్నీ డ్యామేజ్ కు సంకేతాలుగా భావించాల్సి ఉంటుంది.
కిడ్నీలు డ్యామేజ్ అయిన లేదా అవుతున్న వారిలో శరీరంలో టాక్సిన్లు అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి రక్తంలోనే ఉంటాయి. బయటకు విసర్జించబడవు. దీని వల్ల చర్మ సమస్యలు వస్తాయి. చర్మ తరచూ దురదగా ఉంటుంది. పొడిబారి దురద పెడుతుంది. అలాగే ఆకలి లేకపోవడం, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం ఇవన్నీ కిడ్నీ డ్యామేజ్‌కు సంకేతాలుగా అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాలు లేదా లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉందని తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీంతో సమస్యను ముందుగానే గుర్తించి కిడ్నీలను కాపాడుకున్న వారు అవుతారు.