Kidney Stones Symptoms | మన శరీరంలో వివిధ రకాల జీవక్రియల వల్ల పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. దీని వల్ల మన శరీరం అంతర్గతంగా శుభ్రంగా ఉంటుంది. రోగాలు రాకుండా ఉంటాయి. అయితే మనం పాటించే ఆహారపు అలవాట్లు, వేసుకునే మందులు, పలు ఇతర కారణాల వల్ల శరీరంలో వ్యర్థాలు మరీ అధికంగా పేరుకుపోతాయి. వాటిని బయటకు పంపించడం కిడ్నీలకు కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో దీర్ఘకాలంలో అవే వ్యర్థాలు కిడ్నీల్లో స్టోన్లుగా మారుతాయి. ఇవి మనకు నొప్పిని, విపరీతమైన ఇబ్బందిని కలగజేస్తాయి. అయితే కిడ్నీ స్టోన్లు ఏర్పడే సమయంలోనే మన శరీరం మనకు పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా స్టోన్స్‌ను ముందే తొలగించుకోవచ్చు. దీంతో పరిస్థితి తీవ్రతరం కాకుండా ముందుగానే గుర్తించి కిడ్నీలను కాపాడుకునే అవకాశాలు ఉంటాయి.
మన శరీరంలో ఉత్పత్తి అయ్యే మూత్రంలో క్యాల్షియం, ఆగ్జలేట్స్, యూరిక్ యాసిడ్ వంటి మినరల్స్, సమ్మేళనాలు ఉంటాయి. అయితే నీళ్లను సరైన మోతాదులో తాగితే వీటిని కిడ్నీలు బయటకు పంపిస్తాయి. కానీ ఇవి కిడ్నీల్లో అధికంగా చేరితే ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోతే దీర్ఘకాలంలో అవి స్టోన్స్‌గా మారుతాయి. ఎక్కువగా క్యాల్షియం, ఆగ్జలేట్ స్టోన్లు కిడ్నీల్లో ఏర్పడుతాయి. తగినంత నీళ్లను తాగకపోవడం, క్యాల్షియం ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, పలు రకాల మందులను దీర్ఘకాలంగా ఉపయోగించడం వంటి కారణాల వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. కిడ్నీ స్టోన్లు ఏర్పడుతున్న సమయంలోనే శరీరం పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో తరచూ జ్వరం వస్తుంటుంది. కొద్ది రోజుల పాటు ఉండి తగ్గుతుంది. మళ్లీ కొన్ని రోజులకు వస్తుంది.
కిడ్నీ స్టోన్లు ఉంటే బొడ్డుకు కింది భాగంలో రెండు వైపులా లేదా అదే ప్రాంతంలో వెనుక వైపు కూడా నొప్పి ఉంటుంది. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు లేదా వంగినప్పుడు ఈ నొప్పి మరింత ఎక్కువవుతుంది. ఆ ప్రాంతంలో సూదులతో పొడిచినట్లు నొప్పి వస్తుంది. కిడ్నీ స్టోన్లు ఉన్నవారిలో కొందరికి వికారంగా అనిపిస్తుంది. వాంతులు కూడా అవుతాయి. కొన్ని రకాల పదార్థాల వాసనలు చూస్తే పొట్టలో తిప్పినట్లు అవుతుంది. కిడ్నీ స్టోన్లు ఉంటే తల తిరిగినట్లు కూడా అనిపిస్తుంది. స్పృహ తప్పి పడిపోతామమోనని కూడా అనిపిస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నవారు మూత్ర విసర్జన చేస్తే మూత్రం దుర్వాసన వస్తుంది. మూత్రంలో నురుగు కూడా కనిపిస్తుంది. మూత్రం ముదురు రంగులో వస్తుంది. కొందరికి మూత్ర విసర్జన సమయంలో రక్తం కూడా పడుతుంది. కిడ్నీ స్టోన్లు ఉంటే నిరంతరాయంగా వెన్ను నొప్పి కూడా వస్తుంది. ఇలా కిడ్నీ స్టోన్లు ఏర్పడుతున్న సమయంలోనే కొన్ని లక్షణాలను మనం ముందుగానే గుర్తించవచ్చు.
ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఎక్స్‌రే, స్కానింగ్, రక్తం, మూత్రం వంటి పరీక్షల ద్వారా కిడ్నీ స్టోన్లు ఉన్నాయో లేదో నిర్దారిస్తారు. కిడ్నీ స్టోన్లు ఉంటే డాక్టర్లు మందులను ఇస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. కిడ్నీ స్టోన్లకు ఇచ్చే మందులను ఒక కోర్సులాగా వాడాలి. అవి కరిగిపోయే వరకు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా చిన్నపాటి సైజులో ఉండే స్టోన్స్‌కు శస్త్ర చికిత్స చేయరు. మందులతోనే కరిగేలా చేస్తారు. ఇక ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్లు ఉన్నవారికి మేలు జరుగుతుంది. స్టోన్స్ త్వరగా కరిగిపోయే అవకాశాలు ఉంటాయి. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫలాలను అధికంగా తింటుంటే కిడ్నీ స్టోన్లు కరుగుతాయి. తర్బూజా, కీరదోస, పుచ్చకాయలు, ద్రాక్ష పండ్లు, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్, కివి, అరటి పండ్లు వంటి పండ్లను రోజూ తింటుంటే ఎంతగానో మేలు జరుగుతుంది.