Diabetes | ఇన్సులిన్‌ను నియంత్రణలో ఉంచుకోవడం డయాబెటిస్ రోగులకు పెద్ద సమస్య. మధుమేహం ఉన్నవాళ్లు రక్తంలో గ్లూకోజ్‌ను పెంచే ఆహారానికి ఆమడ దూరం ఉండాలి. పిండి పదార్థాలు తక్కువగా ఉన్న కూరగాయలు, పండ్లు తీసుకుంటే గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్ అదుపులోనూ ఉంటుంది.
ప్రతీ కూరగాయకూ దానికే ప్రత్యేకమైన పోషకాలు, ఫైబర్ ఉంటాయి. వాటిలో కొన్ని ఇన్సులిన్ మీద సమర్థంగా పనిచేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయులనూ నియంత్రిస్తాయి. డయాబెటిస్ అదుపులో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. వీరికి పిండి పదార్థాలు (స్టార్చ్) లేని ఆహార పదార్థాలు తిరుగులేని ప్రత్యామ్నాయం. ఈ తరహా కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పిండి పదార్థాలు ఉన్న కూరగాయలతో పోలిస్తే, పిండి పదార్థాలు లేనివే ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి. స్టార్చ్ లేని కూరగాయలతో శరీరంలో కార్బొహైడ్రేట్ల పరిమాణం తగ్గించుకోవచ్చు. అదే సమయంలో రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచుకుంటూ, ఇన్సులిన్‌కు పగ్గం వేయవచ్చు.
ఇవే ఎందుకు?
నాన్ స్టార్చ్ కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా, పిండి పదార్థాలు, చక్కెరలు తక్కువగా ఉంటాయి. అత్య వసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తిన్న ప్రతిసారీ, శరీరంలోకి నామమాత్రంగా కార్బొహైడ్రేట్లు చేరుకుంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువే. అలా, నాన్ స్టార్చ్ కూర గాయలు గుండె కవాటాల వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్, కొన్నిరకాలైన క్యాన్సర్లు, ఊబకాయం ముప్పు తగ్గించుకోవడానికి దోహదపడతాయి.
Diabetes
ఏవి నాన్ స్టార్చ్?
శరీరంలో ఇన్సులిన్ అదుపులో పెట్టుకునేందుకు తినదగిన స్టార్చ్ లేని కూరగాయలు, పండ్ల జాబితా పెద్దగానే ఉంటుంది. తోటకూర, పాలకూర, క్యాబేజీ జాతికి చెందిన కేల్, క్యాప్సికం (బెల్‌పెప్పర్స్), ఉల్లి, క్యాబేజీ, బ్రకోలి, కాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, నల్ల సోయాబీన్స్, గ్రీన్ బీన్స్, వంకాయ, దోసకాయలు, ఎర్రముల్లంగి, పుట్టగొడుగులు, మక్కజొన్న, మొరంగడ్డ, పచ్చ బటానీ, గుమ్మడి, వైట్ పొటాటో లాంటివి ఈ జాబితాలోకి వస్తాయి. పండ్లలో అవకాడో, బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ మరీ మంచివి. వీటిలో చక్కెర తక్కువగా, ఫైబర్ ఎక్కువ. తీపి తినాలనుకున్నప్పుడు వీటిని తీసుకుంటే బాగుంటుంది. అదనంగా ఆహారంలో తగిన మోతాదులో కార్బొహైడ్రేట్లు కూడా ఉండేలా చూసుకోవాలి.