Jowar Malt | పూర్వకాలంలో మన పెద్దలు చాలా వరకు జొన్నలను ఆహారంగా తినేవారు. జొన్నలతో పలు రకాల వంటకాలను తయారు చేసుకుని తినేవారు. జొన్న రొట్టెలు, జొన్న సంగటి, జొన్న అన్నం, జొన్న జావను తయారు చేసి తీసుకునేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తినడం లేదు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. అయితే జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. జొన్నల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా 100 గ్రాముల జొన్నల ద్వారా మనకు సుమారుగా 329 క్యాలరీల శక్తి లభిస్తుంది.
కొవ్వులు 3.5 గ్రాములు, పిండి పదార్థాలు 72 గ్రాములు, ఫైబర్ 6.7 గ్రాములు, ప్రోటీన్లు 11 గ్రాములు లభిస్తాయి. అలాగే జొన్నల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు జొన్నలతో రోజూ ఏదో ఒక వంటకాన్ని చేసి తింటే త్వరగా ఎముకలు అతుక్కుంటాయి. జొన్నల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల రక్తం తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. జొన్నల్లో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
జొన్నల్లో థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్ కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఇవి రోగాల నుంచి మనల్ని రక్షిస్తాయి. జొన్నలలో రెండు రకాలు ఉంటాయి. పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు. మార్కెట్లో మనకు రెండు రకాల జొన్నలు అందుబాటులో ఉన్నాయి. తెల్ల జొన్నలతో చాలా మంది రొట్టెలు తయారు చేస్తారు. పచ్చ జొన్నలతో జావ, గటక, అన్నం తయారు చేస్తారు. రెండింటిలో వేటిని తీసుకున్నా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
జొన్నలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. వీటిని తీసుకుంటే క్యాన్సర్ పేషెంట్లకు ఎంతగానో మేలు జరుగుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను జొన్నల్లో ఉండే సమ్మేళనాలు అడ్డుకుంటాయి. ఇక జొన్నలతో జావను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్నలతో జావను తయారు చేసేందుకు గాను జొన్న పిండిని అరకప్పు తీసుకోవాలి, మజ్జిగ ఒక కప్పు, ఉప్పు తగినంత తీసుకోవాలి. జొన్న పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకునొ ఉండలు లేకుండా కలపాలి. వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించి తరువాత ఈ పిండి మిశ్రమాన్ని కలపాలి. తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు ఉడికించాలి. సరిపడా ఉప్పు, పలుచని మజ్జిగ కలిపి తాగాలి. ఇష్టమైతే పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా రోజూ జొన్నల జావను తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.