Joint Pains | చలికాలంలో సహజంగానే రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో కీళ్లు పట్టుకుపోయి దృఢంగా మారుతాయి. అయితే కొందరికి నొప్పులు కూడా ఉంటాయి. అలాగే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి చలికాలంలో ఇంకా నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఆయా భాగాల్లో వాపులు కూడా వస్తాయి. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని రకాల సూచనలు, ఆరోగ్య చిట్కాలను పాటిస్తే చలికాలంలో వచ్చే ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. చలికాలంలో చాలా మంది ఎదుర్కొనే ఆర్థరైటిస్ నొప్పులతోపాటు ఇతర నొప్పులు కూడా తగ్గిపోవాలంటే అందుకు జీవన విధానంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ నొప్పులకు ఈ సీజన్లో చెక్ పెట్టవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో పగటిపూట కూడా చల్లగానే ఉంటుంది. అందుకని శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. సాధ్యమైనంత వరకు రోజంతా ఉన్ని దుస్తులను ధరిస్తే మంచిది. శరీరాన్ని నిరంతరం వెచ్చగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఫలితంగా కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కాళ్లను వెచ్చగా ఉంచేందుకు గాను సాక్సులను ధరిస్తే మంచిది. దీంతో రక్త ప్రసరణ పెరిగి నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా నొప్పులు ఉన్నవారు ఈ సీజన్లో ఎట్టి పరిస్థితిలోనూ చన్నీటి స్నానం చేయకూడదు. దీని వల్ల నొప్పులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కనుక వేడి నీటి స్నానం చేయాలి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఇది నొప్పులను తగ్గిస్తుంది.
చలికాలంలో ఉదయం చాలా చల్లగా ఉంటుంది కనుక ఉదయం నిద్ర లేచి వ్యాయామం చేసేందుకు చాలా మంది బద్దకంగా ఉంటారు. కానీ ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త సరఫరాను పెంచుతుంది. తేలికపాటి నడక లేదా యోగా, స్విమ్మింగ్ వంటివి చేయడం వల్ల కీళ్లు సాగే గుణాన్ని పొందుతాయి. దీంతో కీళ్లు దృఢంగా మారకుండా ఉంటాయి. ఫలితంగా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కనుక శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే అది తగ్గేందుకు కాపడం పెట్టవచ్చు. హాట్ ప్యాక్ లను వాడి కాపడం పెడితే నొప్పుల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.
కొందరు చలికాలంలో జిమ్ లేదా వ్యాయామం ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువగా శారీరక శ్రమ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని అలా చేస్తుంటారు. కానీ చలికాలంలో అలా చేయడం ప్రమాదకరం. అది గుండె పోటు వచ్చేందుకు దారి తీయవచ్చు. పైగా కీళ్లపై కూడా భారం పడుతుంది. దీంతో కీళ్లు వాపులు, నొప్పులకు గురవుతాయి. కనుక అతిగా వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయకూడదు. అలాగే చలికాలంలో మనకు విటమిన్ డి లభించడం కష్టతరమవుతుంది. కనుక డాక్టర్ సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి. అలాగే విటమిన్ డి ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. ఇది శరీరంలో క్యాల్షియం శోషణను ప్రేరేపిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇలా పలు సూచనలు, చిట్కాలు పాటించడం వల్ల చలికాలంలో వచ్చే నొప్పులకు చెక్ పెట్టవచ్చు.