Jasmine Flowers Tea | మల్లె పువ్వులను సాధారణంగా మహిళలు తమ జుట్టులో ధరిస్తుంటారు. అలాగే శుభ కార్యాల్లో, దైవ పూజ కోసం కూడా వినియోగిస్తారు. మల్లె పువ్వుల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే బొండు మల్లె పువ్వులతో చేసిన టీ పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. దీన్ని మనం హెర్బల్ టీగా సేవించవచ్చు. ఈ క్రమంలోనే మల్లె పువ్వుల టీ తయారు చేసి తాగితే అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పలు వ్యాధులకు ఈ టీ ఔషధంగా పనిచేస్తుందని, అలాగే అనేక పోషకాలను కూడా అందిస్తుందని అంటున్నారు. మల్లె పువ్వుల టీలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఎల్-థియానైన్ అనే సమ్మేళనం కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మల్లె పువ్వుల టీని రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల మోతాదులో తాగితే అనేక లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మల్లె పువ్వుల టీలో ఉండే పాలిఫినాల్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించడంలో సహాయ పడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. వృద్ధాప్యం రాకుండా అరికట్టవచ్చు. ముఖంపై ఉండే ముడతలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. మల్లె పువ్వుల టీని సేవిస్తుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
మల్లె పువ్వుల టీలో కెఫీన్, కాటెకిన్స్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ టీని రోజూ రెండు కప్పులు తాగితే మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు మల్లెపువ్వుల టీని సేవిస్తుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ టీని సేవించడం వల్ల మనకు ఎల్-థియానైన్ అనే సమ్మేళనం లభిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
మల్లె పువ్వుల టీలో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే చెడు బ్యాక్టీరియా పోయి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మల్లె పువ్వుల టీలో ఉండే కాటెకిన్స్ నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ టీని సేవించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. ఈ టీని రోజూ సేవిస్తుంటే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. దీంతో క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. ఇలా మల్లె పువ్వుల టీతో అనేక లాభాలను పొందవచ్చు.