Jamun | నీలి రంగులో నిగనిగలాడుతూ ఉండే అల్లనేరేడు పండును చూడగానే తినాలనే కొరిక ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది. కాస్తా ఒగరుగా, మరికొంత పులుపు, తీపి కలగలిపి ఉండే నేరేడు పండ్లలో ఎన్నో పోషకాలు ఉండి మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అల్లనేరేడు పండ్లలో క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్-సీ, విటమిన్-బీ కాంప్లెక్స్‌లోని రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-బీ6 వంటి వాటితోపాటు కెరటిన్, ఫోలిక్‌యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి.
మధుమేహ నివారణలో..
రక్తంలో చక్కెర నిల్వల స్థాయిలను క్రమబద్దీకరించడంలో జామూన్లు చాలా గొప్పగా పనిచేస్తాయి. వీటి గింజల్లో జంబోలిన్, జాంబోసిస్ అనే సమ్మెళనాలు ఉండి వీటిని తినగానే రక్తంలోకి చక్కెర విడుదల రేటును నియంత్రిస్తాయి. జామూన్ విత్తనాలు కూడా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
ఫైబర్ కలిగి ఉండి..
అల్లనేరేడు కడుపు ఆరోగ్యాన్ని పెంచుతాయి. వీటి గింజలను తినడం వల్ల కడుపు సంబంధ సమస్యలను నివారించవచ్చు. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి పేగుల్లో పుండ్లు, మంట, పూతలను ఎదుర్కోవడానికి ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు.
రక్తపోటు నివారణలో..
నేరేడు పండ్లు రక్తపోటు నివారణలో గ్రేట్‌గా పనిచేస్తుంది. వీటి విత్తనంలో ఎల్లాజిక్ యాసిడ్ అనే యాంటీఆక్సిడెంట్ రక్తపోటు హెచ్చుతగ్గులను తనికీ చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
రోగనిరోధక శక్తిలో..
అల్ల నేరేడు గింజల్లో ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. అలాగే వీటిలోని ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడే ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి.
బరువు తగ్గడంలో..
శరీరం బరువు తగ్గడంలో నేరేడు పండ్లు సహకరిస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండి ఆకలి భావన రాకుండా చూస్తాయి. ఫలితంగా శరీరం బరువు తగ్గించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది.
అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో, క్యాన్సర్ల కణాలు వృద్ధి చెందకుండా చేయడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, నోటిలో దంతాలు, గమ్ ఆరోగ్యంగా ఉంచడంలో, కిడ్నీ సమస్యలు రాకుండా ఉండేందుకు, ఆస్తమా నుంచి ఉపశమనానికి, అల్సర్లు రాకుండా చూడటానికి, ఓర్పును పెంచడానికి సహాయపడుతుంది. వికారం, వాంతులను దూరం చేస్తుంది. వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలకు అడ్డుకట్ట వేసి, దీర్ఘకాలం యవ్వనంగా ఉంచుతుంది. చర్మంపై వచ్చే తెల్లమచ్చలను తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. రుమాటిక్ నొప్పులు, గౌట్ సమస్య వల్ల కలిగే బాధలు దూరమవుతాయి.
కాగా, నేరేడు విత్తనాలను పొడి రూపంలో తీసుకుంటుంటారు. వీటిని స్మూతీస్గా తీసుకుంటారు. నీటితో నేరుగా కూడా తింటారు. వంటల్లో కూడా చేర్చుకుంటారు.