కొవ్వు పదార్థాలు హానికరమనే సంగతి తెలిసిందే. అయితే, అన్ని కొవ్వులూ ప్రమాదకరం కాదని ఓ తాజా పరిశోధన వెల్లడించింది. నిజమే, నెయ్యి అచ్చమైన కొవ్వు పదార్థమే. అయినా సరే, భారత్ లాంటి ఉష్ణమండల దేశాల ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఇందులో ఉన్నాయి.
నెయ్యి కనీసం 6 నుంచి 8 నెలలపాటు పాడవకుండా ఉంటుంది. దీని మండే ఉష్ణోగ్రత 250 డిగ్రీల సెంటీగ్రేడ్స్. కాబట్టి, డీప్ ఫ్రై చేయడానికి అనువైనది. ఇందులోని బ్యూటిరిక్ ఆమ్లం పొట్ట ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తికి ప్రయోజనకరం. కొవ్వులో కరిగే విటమిన్లు శరీరంలో కలిసిపోయేలా చేస్తుంది నెయ్యి. సులువుగా అరిగిపోతుంది కూడా. ఇందులో ల్యాక్టోజ్, కేసిన్ ఉండవు. అందువల్ల ల్యాక్టోజ్ అంటే పడని వారు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.