మా బాబుకు మూడేండ్లు. హుషారుగా ఉండేవాడు. చక్కగా మాట్లాడేవాడు. కానీ, ఈ మధ్య పిలిస్తే పలకడం లేదు. కొంచెం గట్టిగా పిలవాల్సి వస్తున్నది. డాక్టర్‌కు చూపిస్తే లోపల నీరు చేరింది. ‘బ్లూ ఇయర్’ ప్రాబ్లమ్ అన్నారు. దీనికి ఆపరేషన్ అవసరమా… మందులతో తగ్గుతుందా?
మామూలుగా మధ్య చెవిలో (కర్ణభేరి పొర లేదా టింపానిక్ మెంబ్రేన్ వెనుక) నీరు చేరుతుంది. ధ్వని తరంగాలు సరిగా ప్రసరించకపోవడం వల్ల సరిగా వినిపించదు. బ్లూ ఇయర్‌కి తప్పనిసరిగా వైద్యం అవసరమని చెప్పలేం. కొంతకాలం ఎదురుచూసి వైద్యం చేయించుకోవచ్చు. ఈఎన్టీ వైద్యులు పరీక్షలు చేసి.. వినికిడి లోపం ఎంత ఉంది? ఇబ్బంది ఎంత తీవ్రంగా ఉందో గుర్తించి అవసరాన్ని బట్టి చిన్న ట్యూబ్‌ల వంటి గ్రామెట్స్ని కర్ణభేరి పొరలో పెడతారు.
దీంతో వినికిడి సమస్య మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఆ ట్యూబ్‌లు ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు బయట పడిపోతాయి. వినికిడి మెరుగవుతుంది. బ్లూ ఇయర్ సాధారణమైన సమస్యే. పూర్తిగా నయం అవుతుంది. కొన్నిసార్లు మాత్రమే గ్రామెట్స్ అమర్చాల్సి వస్తుంది. ఈఎన్టీ డాక్టర్ సలహా ప్రకారం వైద్యం చేయించండి. ఇది పెద్ద ఆపరేషన్ కాదు. కంగారు పడే సమస్య కాదు.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్