మా పాప వయసు మూడేండ్లు. బాగానే తింటుంది, చక్కగా ఆడుకుంటుంది. కానీ, గడిచిన నాలుగు నెలల్లో పాపకు మూడుసార్లు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన ప్రతిసారీ అమ్మాయి శరీరంపై ఎర్రగా దద్దుర్లు కనిపించాయి. వైద్యుణ్ని సంప్రదిస్తే.. ఇవి ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చిన ర్యాషే అన్నారు! కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు! అయితే, పాపకు జ్వరం వచ్చిన ప్రతిసారీ దద్దుర్లు రావడం ఆందోళన కలిగిస్తున్నది! సలహా ఇవ్వగలరు?
వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జ్వరం వస్తే ర్యాషెస్ కనిపిస్తుంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు ఎన్నో రకాలు! డెంగ్యూ కూడా అలాంటి ఇన్ఫెక్షనే!! అయితే బిడ్డ యాక్టివ్గానే ఉందంటున్నారు కాబట్టి.. మీ అమ్మాయికి వచ్చింది డెంగ్యూ కాకపోవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా జ్వరం వచ్చినప్పుడు కూడా దద్దుర్లు తేలవచ్చు. ఆటోఇమ్యూన్ కండిషన్స్‌లో కొందరి పిల్లల్లో కాళ్లు వాచడంతోపాటు ర్యాషెస్ వస్తుంటాయి. జ్వరం కూడా బాధిస్తుంది. అయితే, తక్కువ వయసులో ఆటోఇమ్యూన్ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా అరుదు! మీ పాపది ఇలాంటి కండిషన్ అయి ఉండదు!! వైద్యులు చెప్పినట్టు వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అనుకోవచ్చు! వైరల్ ఇన్ఫెక్షన్లే కాకుండా.. కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలోనూ ఒంటిపై దద్దుర్లు రావొచ్చు.
కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల కూడా పిల్లలకు తీవ్ర జ్వరం, దద్దుర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, జ్వరం వచ్చినప్పుడు ర్యాషెస్ రావడం పెద్ద ప్రమాదకరమైతే కాదు! అయితే పిల్లలకు వచ్చింది ఏ జ్వరం, ఏ రకమైన ఇన్ఫెక్షన్ అని నిర్ధారణ చేసుకుంటే.. దాన్ని బట్టి దద్దుర్ల సంగతి చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో ఈ దద్దుర్లు వాటికవే తగ్గిపోతాయి. అయితే, దద్దుర్లు రావడానికి కారణమైన ఇన్ఫెక్షన్కి చికిత్స చేయాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా వల్ల తలెత్తిన జ్వరమైతే దానికి యాంటి బయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జ్వరం తలెత్తితే.. లక్షణాలకు అనుగుణంగా చికిత్స ఇవ్వడం తప్పితే.. ప్రత్యేకంగా యాంటి వైరల్ మెడికేషన్ అవసరం రాదు. నాకు తెలిసి.. మీ అమ్మాయిది పెద్ద సమస్యేం కాదు. కాకపోతే మూడుసార్లు ఇలా జరిగింది అంటున్నారు కాబట్టి, పిల్లల వైద్యులను సంప్రదించడం మంచిది. అవసరం అనిపిస్తే.. పీడియాట్రిక్ డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్