Flatfoot | మా అబ్బాయికి నాలుగేండ్లు. అరికాళ్లు బాగా చదునుగా (ఫ్లాట్ ఫూట్) ఉన్నాయి. చాలా చలాకీగా ఉంటాడు. అయితే, అప్పుడప్పుడూ పడిపోతూ ఉంటాడు. వైద్యుణ్ని సంప్రదిస్తే ఏ ఇబ్బందీ లేదన్నారు. ఎలాంటి చికిత్సా అవసరం లేదని కూడా చెప్పారు. మావారికి కూడా ఫ్లాట్ఫూట్ ఉండటం వల్ల, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యేకమైన షూస్ వాడుతున్నారు. పిల్లవాడి విషయంలో ఫ్లాట్పూట్ సమస్యాత్మకమా? పరిష్కారం చూపగలరు.
పిల్లల్లో అరికాళ్లు చదునుగా ఉండటం సర్వసాధారణం. పిల్లలకు మూడు నుంచి నాలుగు సంవత్సరాల మధ్య పాదాల్లో ఆర్చెస్ ఏర్పడతాయి. కొంతమందిలో ఐదారేండ్లు కూడా పట్టొచ్చు. కాకపోతే, ఈ ఫ్లాట్ఫూట్ అనేది కుటుంబంలో ఎవరికైనా ఉంటే.. పిల్లలకూ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందే వైద్యుడికి చూపించామన్నారు. అయితే ఒకసారి పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ వైద్యుణ్ని సంప్రదించండి. బహుశా ఇప్పటికిప్పుడు చికిత్స ఏం అవసరం ఉండకపోవచ్చు. కానీ, పాదాల్లో ఆర్చెస్ ఎలా అభివృద్ధి చెందుతున్నాయో గమనిస్తూ ఉండాలి. అవి అంతగా అభివృద్ధి చెందని పక్షంలో ప్రత్యేకమైన షూలు, ఇన్ఫోల్డ్స్ ఇవ్వడం జరుగుతుంది.
ఫ్లాట్ఫూట్ ఇబ్బంది ఉన్నట్టయితే, బిడ్డకు పాదాలు నొప్పి పుడతాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఫ్లాట్ఫూట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో ఫ్లెక్సిబుల్. అది బిడ్డ మునివేళ్ల మీద నిల్చున్నప్పుడు పాదాల్లో ఆర్చెస్ కనిపిస్తాయి. అదే పాదం కింద పెట్టినప్పుడు ఆర్చెస్ ఉండవు. మునికాళ్లపై నిలబడ్డా, నడుస్తున్నప్పుడు కూడా ఫ్లాట్గా ఉంటే దాన్ని రిజిడ్ అంటారు. ఈ పాదానికి వెనకాల ఉండే టెండో ఎక్లిస్ బిగుతుగా ఉందో లేదో కూడా పరీక్షించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా, ఇది పెద్ద సమస్య కాదు. కానీ, మీ కుటుంబ చరిత్రలో ఇది ఉంది కాబట్టి, ఒకసారి పిల్లల ఆర్థోపెడిక్ వైద్యుణ్ని సంప్రదించి, సలహా పాటిస్తే మంచిది.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్