Mental Health | వ్యాయామం చేయడం ద్వారా మనం ఫిట్‌గా ఉండటమే కాకుండా మన మనసును కూడా ఫిట్‌గా ఉంచుకోవచ్చు. వ్యాయామాలు చేసేందుకు కొందరు జిమ్‌లను ఎంచుకోగా.. మరికొందరు ఇంటి పట్టునే చేస్తున్నారు. ఏ విధంగా చేసినా.. చూసినా.. నిత్యం అర్ధగంట మేర వ్యాయామం చేయడం మన ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని సెలవిస్తున్నారు ఫిట్నెస్ నిపుణులు. మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా వైద్యులు ఇలాంటి సిఫారసులే చేస్తుంటారు.
మానసిక ఆరోగ్యం కోల్పోయిన వారు ఎక్కువ సమయం విచారంగా ఉండటంతో పాటు, విపరీతమైన నిద్రలో గడుపుతుంటారు. ఏ విషయాన్ని స్పష్టంగా ఆలోచించలేరు. ఏ విషయంలోనూ శ్రద్ధ చూపరు. ఆత్మహత్య గురించి ఆలోచిస్తుంటారు. తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతుంటారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మత్తుపానీయాలకు అలవాటు పడుతుంటారు.
మానసిక ఆరోగ్యం మంచి శారీరక ఆరోగ్యం మాదిరిగానే చాలా ముఖ్యమైనది. మన శరీరానికి గుండె, ఊపిరితిత్తులు, కండరాలు ఎంత ముఖ్యమైనవో.. అంతే ముఖ్యమైన అవయవం మెదడు. శరీరంలోని అన్ని అవయవాల మాదిరిగానే మెదడులో ఉన్న రక్తనాళాలకు కూడా తగినంత ఆక్సీజన్ అందితేనే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. వ్యాయామాలను నిత్యం అనుసరించడం ద్వారా గుండె సామర్ధ్యం పెంచడమే కాకుండా రక్త నాళాల స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. మెదడు న్యూరాన్లలోని కనెక్షన్లను, నాడీ సంబంధాలను బలంగా ఉంచుతుంది. శరీరానికి వ్యాయామం చేయడం ద్వారా మెదడుకు వెళ్లే మార్గం కూడా బలంగా తయారవుతుంది.
మెదడు పనిచేయడానికి నాడీ కనెక్టివిటీ చాలా ముఖ్యమైనది. వయసు పెరిగాక శారీరక శ్రమ, వ్యాయామం వైవిద్యాన్ని కలిగిస్తాయి. ఒత్తిడి నివారణకు కూడా తోడ్పడుతుంది. నడక, స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, డ్యాన్సింగ్, ఎరోబిక్ వ్యాయామాలు, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటికి సమయం కేటాయించాలి. అలాగే యోగ, మెడిటేషన్ వంటివి కూడా చేయాలి. ద్వారా మెదడుకు ఎక్కువ ఆక్సీజన్ అందుతుంది. మెదడుకు ఎక్కువ మొత్తంలో ఆక్సీజన్ అందే సమయంలో న్యూరాన్లు మరింత శక్తివంతంగా పనిచేసి మనలో ఒత్తిడిని దూరం చేస్తాయి. మెదడు ఆరోగ్యంగా మారిందనే ఫలితం మనకు వెంటనే తెలియదు. ఎనిమిది వారాలపాటు వ్యాయామాలు కొనసాగించిన తర్వాత మీకు మీరుగా మెదడు పనితీరును గమనించవచ్చు.